హైదరాబాద్, సెస్టెంబర్ 1 (న్యూస్‌టైమ్): తెలంగాణ శాసనసభ, మండలి బడ్జెట్‌ సమావేశాలు పది రోజుల పాటు జరగనున్నాయి. ఈ నెల 9న ప్రారంభమయ్యే సమావేశాలలో తొలిరోజే ఉభయ సభల్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆర్థిక శాఖ బాధ్యతల్ని కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమావేశాల తొలిరోజే శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో మరో మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

10న మొహర్రం సెలవు కాగా 11 నుంచి సభ కొనసాగుతుంది. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరి 22న తెలంగాణ ప్రభుత్వం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జులై 5న కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బడ్జెట్‌పై సమగ్ర చర్చ కోసం ఎక్కువ రోజులు నిర్వహించాలని అధికార పార్టీ భావిస్తోంది.

సమావేశాల పూర్తి ఎజెండా, సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలను శాసనసభ కార్యకలాపాల సలహా కమిటీ (బీఏసీ)లో ఖరారు చేయనున్నారు. ప్రాథమికంగా బడ్జెట్‌ సమావేశాలు పది రోజులు నిర్వహించాలనే ప్రతిపాదన ఉంది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టాక బడ్జెట్‌తో పాటు శాఖల వారీగా గ్రాంట్లు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సాగుతుంది. పురపాలక శాఖ చట్టంపై జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. దానిపై చర్చించి ఆమోదిస్తారు.