హైదరాబాద్, సెస్టెంబర్ 1 (న్యూస్‌టైమ్): తెలంగాణను కోటి ఎకరాల మాగాణ చేయాలనే తమ ప్రభుత్వ లక్ష్య సాధన కోసం అకుంఠిత దీక్షతో ప్రాజెక్టుల నిర్మాణ మహాకార్యాన్ని పూర్తిచేయాల్సి ఉన్నదని. ప్రతీప శక్తులు సృష్టించిన అనేక ఆటంకాలను ఎదుర్కొని ఇప్పటికే కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకున్నామని, అదే స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసుకుని తెలంగాణ సాగు భూములకు నీరు అందిద్దామని, ప్రజాప్రతినిధులకు, ఇంజనీరింగ్ అధికారులకు, వర్క్ ఏజెన్సీలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నడుస్తున్న పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్ కార్యస్థలంలో నిర్వహించారు. అంతకుముందు కరివేన వట్టెం నార్లాపూర్ రిజర్వాయర్ల పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా రిజర్వాయర్ల నిర్మాణం కాలువలు సొరంగ మార్గాల తవ్వకాలు సంబంధిత ఎత్తిపోతల పంపులు మోటార్లు బిగింపు పనులు విద్యుత్ నిర్మాణ పనుల పురోగతి, మిషన్ భగీరథ పథకం పనుల పురోగతి, కల్వకుర్తి ఎత్తిపోతల పనుల పురోగతి తదితర అంశాలపై పాలమూరు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు, ప్రాజెక్టు ఇంజనీర్లు సీఎంఓ అధికారులు వర్క్ ఏజెన్సీల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ కల్లా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా నాలుగు రిజర్వాయర్లను నింపి సాగు భూములకు నీళ్లు అందించాలని స్పష్టం చేశారు.

అందుకోసం ఏ ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయి.. ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తవుతాయని అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటిని తీసుకునే నార్లాపూర్ పంప్ హౌస్‌తో పాటు నార్లపూర్ రిజర్వాయరు పనులు అక్కడ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే కాలువలు సొరంగ మార్గాలు ఎదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తీసుకుపోయే కాలువలు అండర్ గ్రౌండ్ సొరంగ మార్గాలు మళ్లీ అక్కడి నుంచి నీటిని కరివేన రిజర్వాయర్‌కు తరలించేదుకు చేపట్టవలసిన కాలువల నిర్మాణాలు పంపులు మోటార్లు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాలకు సంబంధించి పనుల పురోగతి గురించి సంబంధిత ఈఎన్సీలను వర్క్ ఏజెన్సీలను వివరాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఇకనుంచి నిర్మాణం పనులు పరుగులు పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మితమైన విధానం, స్ఫూర్తిని తీసుకొని పని చేయవలసి ఉన్నదని వివరించారు.

ఇంకా చిన్న చిన్న సమస్యలు భూసేకరణ పునరావాస ఏర్పాటు తదితర అంశాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తి చేయాలని సంబంధిత మంత్రులకు ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. ఇకనుంచి సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ పాలమూరు-రంగారెడ్డి పనుల పురోగతిపై ప్రతి పది రోజులకు ఒకసారి వచ్చి సమీక్ష జరుపుతారని సీఎం తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల మంత్రులు ప్రజాప్రతినిధులతో మరొకసారి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి సాగు నీటి పంపిణీకి సంబంధించి ఏర్పాటు చేసుకోవాల్సిన చిన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు కొత్త గా కాలువలు ఇంకా ఇతరత్రా సమస్యలు ఉంటే వాటిపై కూలంకషంగా సమగ్రంగా చర్చించాలని సీఎం సూచించారు.

ఉమ్మడి పాలమూరు-రంగారెడ్డి ఎమ్మెల్యేలు ఎంపీలు సమన్వయంతో చర్చించి తమ అభిప్రాయాలను స్మితా సబర్వాల్ కు తెలియచేయాలని అన్నారు. ‘‘కాళేశ్వరం పని పట్టినం ఇకనుంచి మీ వెంట పడతాం’’ అని నవ్వులు పూయించిన ముఖ్యమంత్రి పాలమూరు-రంగారెడ్డి నల్లగొండ జిల్లాలను ఆకు పచ్చగా మార్చే వరకు అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉందని సమీక్షలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే 100% నిర్మాణం పూర్తి చేసుకున్న ఏదుల రిజర్వాయర్లలో ఇతర మార్గాల ద్వారా నీటిని తెచ్చి నింపుకోవాలని, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని నింపే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. కాగా సమీక్షను కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో ప్రారంభించిన సీఎం ఆ పథకం పనుల వివరాలు అడిగి తెలుసుకొని అందుకు సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చారు.

నీటిని ఎత్తి పోసే బాహుబలి పంపులు మోటార్లు కాళేశ్వరం మాదిరి ఇక్కడ కూడా పెద్ద పెద్ద పంపులను మోటార్లను వినియోగించనున్నారు. వాటిని బయటనుంచి కాకుండా వీలైనంతవరకు బి.హెచ్.ఈ.ఎల్ కంపెనీ ద్వారానే కొనుగోలు చేయాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధి మెగా కృష్ణారెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘గత వలసపాలకుల తెలివిలేని తనంతో తెలంగాణను ఎండబెట్టినృ ఒకప్పుడు ఆకలి రాజ్యం ఉన్న తెలంగాణలో ఇప్పుడు స్వయంపాలనలో నీళ్ల రాజ్యం వస్తున్నందుకు ప్రజలు సంతోష పడుతున్నారు. ఇటీవల పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ప్రజల స్పందన చూస్తేనే తెలుస్తున్నది. మరో రెండేళ్లలో తెలంగాణ ప్రాజెక్టులు రిజర్వాయర్లు కాలువలతో పచ్చని పంట పొలాలతో ఆకుపచ్చని జలదృశ్యం ఆవిష్కరించబడాలే. అప్పులతో బాధపడుతున్న తెలంగాణ రైతు ఇక ఆ మిగులు పెట్టుబడితో ఆనందంతో జీవించాలే’’ అని ఆకాంక్షించారు.

ఆ లక్ష్యాన్ని చేరుకున్న దాకా విశ్రమించేదిలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మిషన్ భగీరథ పనుల పురోగతిపై సంబంధిత ఈఎన్సీ కృపాకర్ రెడ్డిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అతి త్వరలో ట్యాంకుల నిర్మాణం అంతర్గత పైపుల నిర్మాణం సంపూర్ణంగా పూర్తి చేసి ఆవాసాలకు తాగు నీటిని అందించాలని ఆదేశించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మితమవుతున్న రిజర్వాయర్లు కాలువల వెంట ఉన్న గ్రామాల్లో చెరువులను అన్నింటిని నింపుకుంటూ పోవాలని సీఎం స్పష్టం చేశారు. తాగు నీటిని అందించాలన్నారు. ఎత్తిపోతలకు సంబంధించిన పంపులు మోటార్లు నడిచేందుకు ఏర్పాటు చేయాల్సిన సబ్ స్టేషన్లు విద్యుత్తు పనుల పురోగతిపై సమీక్షించిన ముఖ్యమంత్రి విద్యుత్ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, అంజయ్య యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అబ్రహం, రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీఎంవో అధికారి స్మితా సభర్వాల్, ఈఎన్‌సీ మురళీధర్ రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్పాండే, కలెక్టర్లు రోనాల్డ్ రాస్, శ్రీధర్, శ్వేతా మహంతి, చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్, విజయ భాస్కర్ రెడ్డి, యోగానంద, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.