ఇస్లామాబాద్, సెస్టెంబర్ 10 (న్యూస్‌టైమ్): జమ్మూ కశ్మీరు ఆంక్షల నేపథ్యంలో అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రతీకార దాడులకు దాయాది పాకిస్తాన్‌ వ్యూహరచన చేస్తోందనే ప్రచారం ఊపందుకుంది. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సహా పలువురిని జైళ్ల నుంచి రహస్యంగా విడిచిపెట్టడం ద్వారా పాక్ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుందని భారత్‌లోని నిఘా వర్గాలు గుర్తించాయి. 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడుల అనంతరం వాటికి బాధ్యత వహించిన జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజర్‌ సహా ఎందరినో అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించిన పాకిస్తాన్ ఇప్పుడు తన దారి మార్చుకుంది.

అజర్‌ని మూడో కంటికి తెలీకుండా రహస్యంగా జైలు నుంచి విడుదల చేసింది. అజర్‌ ప్రస్తుతం పాక్‌ జైల్లో లేడని, భవల్పూర్‌లో జైషే మహమ్మద్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్నట్టుగా భారత్‌ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. కశ్మీర్‌లో అల్లకల్లోలం సృష్టించడానికి, భారత్‌లో భారీగా దాడులకు పాక్‌ కుట్ర పన్నుతున్నట్టు భద్రతా అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లోకి చొరబడడం, ఈ ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించడం, కశ్మీర్‌లో ఘర్షణలు రేగేలా ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేయడం వంటి వాటి కోసం పాక్‌ అజర్‌ను విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. జైషే ప్రధాన కార్యాలయంలో అజర్, ఆయన సోదరులు, సంస్థకి చెందిన ఇతర సభ్యులు దాడులకు వ్యూహాలను రచిస్తున్నట్టు భారత్‌కు ఉప్పందింది. అజర్‌ను ఇటీవల భారత్‌ ఉగ్రవాది ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు, భారత్‌లోని దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని సదరన్‌ కమాండ్‌ జీవోసీ (జనరల్‌ ఆఫీసర్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌) లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌కే సైనీ వెల్లడించారు. పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో సరిహద్దుల్లోని సర్‌ క్రీక్‌ లేన్‌ వద్ద ఇటీవల గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నాం. ఇవి దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించిన ఉగ్రవాదులవేనని అనుమానిస్తున్నాం. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందంటూ మాకు సమాచారం అందింది. దీతో సర్‌ క్రీక్‌ ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నాం’’ అని తెలిపారు. రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెన్నైలో మాట్లాడుతూ ‘‘ఆర్మీ సదరన్‌ కమాండ్‌ పరిధిలోకి గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయి.

అందుకే, జనరల్‌ సైనీ తెలిపిన ప్రకారం ఉగ్ర దాడి హెచ్చరికలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు గుజరాత్‌‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి’’ అని వివరణ ఇచ్చారు. దక్షిణాదిన ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచినట్లు ఏపీ అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) రవిశంకర్‌ అయ్యనార్‌ తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ను మోహరించినట్లు వివరించారు.

‘‘కీలక సంస్థలు, వ్యవస్థ లున్న చోట పరిస్థితులపై తీరప్రాంత పోలీస్‌ స్టేషన్లతోపాటు ఎస్‌పీఎఫ్‌ విభాగాన్ని మా కంట్రోల్‌ రూం అప్రమత్తం చేస్తోంది. ముఖ్యం గా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటే శ్వరాలయం, శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం’’ అని అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానా శ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, జన సమ్మర్థం ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచాలని పోలీసులను కేరళ డీజీపీ లోకనాథ్‌ బెహరా కోరారు.