న్యూఢిల్లీ, సెస్టెంబర్ 10 (న్యూస్‌టైమ్): జమ్మూ కాశ్మీర్‌లో భారత్ ప్రభుత్వం విధించిన ఆంక్షలపై అలకబూనిన పాకిస్థాన్ ఐరాస వేదికగా తన గొంతు వినిపించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రచారాన్ని పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలను కేంద్రం అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు సిద్ధమయింది. ఈ నేపథ్యంలో జెనీవా వేదికగా మంగళవారం జరగనున్న ఐరాస యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సదస్సుకు హాజరవుతూనే కశ్మీరు అంశంపై పాక్ చేస్తున్న ప్రచారానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వరాదని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా విదేశాంగ మంత్రిని కాకుండా కేవలం కార్యదర్శి స్థాయి అధికారి నాయకత్వంలోని ఓ బృందాన్ని జెనీవా సమావేశాలకు పంపించే ఏర్పాటు చేసింది భారత్.

జమ్మూ కశ్మీరులో ఆంక్షలు తొలగించాలని ఢిల్లీపై పాక్‌ అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో జెనీవాలోని ఐరాస మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో మంగళవారం కాశ్మీర్ సమస్యపై భారత్, పాకిస్తాన్ విభేదించనున్నాయి. యూఎన్‌హెచ్‌ఆర్‌సీ 42వ సెషన్‌లో పాకిస్తాన్ గొంతు వినిపించేందుకు ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమూద్ ఖురేషి నాయకత్వంలోని బృందం ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకుంది. కాశ్మీర్లో జరిగిన దారుణాలు, భారత్ అనుసరించిన వైఖరి తదితర అంశాలను ఈ సెషన్లో పాకిస్థాన్ ఖచ్చితంగా మాట్లాడడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని పాక్ మంత్రి షా మెహమూద్ ఖురేషి ట్వీట్ చేశారు.

జమ్మూ కశ్మీరు రాష్ట్ర ప్రత్యేక హోదాను ఉపసంహరించుకుని, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించాలని ఆగస్టు 5న భారతదేశం నిర్ణయించిన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై దృష్టి సారించనున్నట్లు ఖురేషి జెనీవా సమావేశాలలో పాకిస్థాన్ తరపున మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రకటన చేస్తారు. అదే విధంగా భారత ప్రతినిధి బృందం కొన్ని గంటల తరువాత తన ప్రకటన చేస్తుంది. మరోవైపు, భారత పక్షం విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో జెనీవా సమావేశాలలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లింది.

ఇస్లామాబాద్‌లోని భారత్ హైకమిషనర్ అజయ్ బిసరియా సహా పలువురు ఉన్నతాధికారులు భారత్ నుంచి వెళ్లిన ప్రతినిధి బృందంలో ఉన్నారు. కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయీకరించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం ఇష్టం లేనందున జెనీవాకు మంత్రిని పంపకూడదని భారత్ నిర్ణయించినట్లు సమాచారం.