న్యూఢిల్లీ, సెస్టెంబర్ 10 (న్యూస్‌టైమ్): మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే కూడా ఆధునికతను సంతరించుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకపక్క ప్రైవేటీకరణ దిశగా వడివడిగా అడుగులు వేస్తూనే ప్రయివేటు పోటీని తట్టుకునేలా సరికొత్త సదుపాయాలతో కూడిన రైళ్లను నడిపి ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ఢిల్లీ–లక్నో, ముంబై–అహ్మదాబాద్‌ మధ్య తిరిగే తేజస్‌ రైళ్లను ఇకపై ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) నిర్వహిస్తుందని రైల్వే బోర్డు చైర్మన్‌ వి.కె.యాదవ్‌ తెలిపారు. ప్రయాణికులు రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చేందుకు, గమ్యస్థానం నుంచి ఇంటికెళ్లేందుకు, లగేజీ తరలింపునకు ఐఆర్‌సీటీసీ ట్యాక్సీలను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు.

ఈ రైళ్లలో వినోదంతో పాటు వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తేజస్‌ రైళ్లకు లోకోమోటివ్‌లు, భద్రతా సిబ్బందిని భారతీయ రైల్వేనే ఏర్పాటు చేస్తుందనీ, మిగతా సేవలన్నీ ఐఆర్‌సీటీసీ అందిస్తుందని చెప్పారు. భారతీయ రైల్వేలను నడిపేందుకు పలు ప్రైవేట్‌ సంస్థలు ఆసక్తి చూపాయని యాదవ్‌ చెప్పారు. ఏదోఒక దశలో రైల్వే రంగం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఐఆర్‌సీటీసీకి ప్రయోగాత్మకంగా రెండు తేజస్‌ రైళ్లను అప్పగించామన్నారు. మరోవైపు, అత్యాధునికంగా తక్కువ రేట్లతో హోటళ్లను నిర్మించడానికి ఐఆర్‌సీటీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

జపాన్‌ తరహా చిన్నచిన్న గదులతో సౌఖర్యవంతంగా ఉండేలా వీటిని డిజైన్‌ చేస్తామని తెలిపింది. ప్రస్తుతానికి పైలెట్‌ ప్రాజెక్టుగా మరికొన్ని రోజుల్లో ముంబైలోని సెంట్రల్‌ స్టేషన్‌లో ప్రారంభిస్తామని పేర్కొంది. జపాన్‌లో ఎక్కువగా కన్పించే ఈ తరహా హోటళ్లని పాడ్‌ హోటల్స్‌ అంటారు. ఈ హోటళ్లలో చిన్న చిన్న గదులు ఉండి ఒక వ్యక్తికి మాత్రమే నిద్రించడానికి వీలుగా ఉంటాయి. మొత్తం మూడు కేటగిరీలుగా హోటల్‌ గదులను నిర్మిస్తామని ఐఆర్‌సీటీసీ చెప్పింది. ప్రతి గదిలోనూ వైఫై, టీవీ, పర్సనల్‌ లాకర్‌ ఉంటాయి. క్లాసిక్‌, ప్రైవేటు, సూట్‌ అనే పేర్లతో మూడు రకాలుగా గదులను విభజించి ఒక్కో గదికి ఒక్కో రేటు విధిస్తామని తెలిపింది. క్లాసిక్‌ రూమ్‌, ప్రైవేటు రూమ్‌ ఒక వ్యక్తికి మాత్రమే సరిపోతాయి.

దీనిలో టీవీ, వైఫై, చార్జింగ్‌ సౌఖర్యం మాత్రమే ఉంటాయి. సూట్‌ పాడ్‌లో మాత్రం ఇద్దరు వ్యక్తులు ఉండొచ్చు, అలాగే వాష్‌రూమ్‌ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ హోటల్‌ నిర్మాణం పూర్తి అయితే ముంబైకి వచ్చే ప్రయాణికులకు స్టే చేయడానికి అనువుగా ఉంటుందని ఐఆర్‌సీటీసీ భావిస్తోంది. ‘‘ఎక్కువ మందికి తక్కువ స్థలంలో సౌఖర్యవంతమైన వసతి కల్పించడమే లక్ష్యమం’’ అని ముంబై సెంట్రల్‌ స్టేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఈ సందర్భంగా తెలిపారు.