న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 (న్యూస్‌టైమ్): అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో క్రీస్తుకు పూర్వం రెండో శతాబ్దం నాటికే అతి పెద్ద రామ మందిరం ఉందని రామ్‌ లల్లా విరాజ్‌మాన్‌ సంస్థ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ సుప్రీం కోర్టు ధర్మాసనానికి తెలిపారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందే ఈ దేవాలయం ఉందని ఆయన స్పష్టం చేశారు.

గతంలో కోర్టు నియమించిన కమిషనర్‌ 1950లో అయోధ్యను సందర్శించి, సమర్పించిన నివేదికను, పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) కనుగొన్న ఆధారాలను ధర్మాసనానికి చూపించారు. ఎఎస్‌ఐ నివేదిక మేరకు స్తంభాలతో కూడిన ఆ పెద్ద నిర్మాణాన్ని మండపంగా భావించారని తెలిపారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోని స్తంభాలపై దేవతామూర్తుల చిత్రాలు ఉన్నాయని కూడా కమిషనర్‌ ఇచ్చిన నివేదికలో ఉందని వైద్యనాథన్‌ తెలిపారు. ఆ తీర్పునిచ్చిన న్యాయవాదుల్లో ఒకరైన జస్టిస్ ఎస్‌యు ఖాన్ మాత్రం ఏఎస్‌ఐ నివేదికను తన తీర్పులో పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

ఖాళీ స్థలంలోనూ ఆలయ శిథిలాలపైన మసీదును నిర్మించారని తప్పుడుగా నిర్దారణకు వచ్చారని తెలిపారు. కానీ ఆ బెంచ్‌లో ఉన్న మరో ఇద్దరు న్యాయమూర్తులు మాత్రం ఏఎస్‌ఐ నివేదికను పరిశీలించారని.. అక్కడ ఆలయం ఉందని అక్కడే మసీదు కూడా నిర్మితమైందని వైద్యనాథన్ తెలిపారు. క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలోనే ఇక్కడ ఆలయం ఉందన్న ఆధారాలు ఉన్నాయని.. అనంతర కాలంలో ముఖ్యంగా కుషణులు, గుప్తుల కాలంలో దీనికి ఎన్నో మార్పులు జరిగాయని వైద్యనాథన్ గుర్తు చేశారు.

అయితే, దీనిపై స్పందించిన రాజ్యాంగ బెంచ్.. ‘ఈ వివాదాస్పద స్థలంలో ఎలాంటి నిర్మాణం ఉండేదన్న దాంతో మాకు సంబంధం లేదు.. మసీదు నిర్మాణానికి ముందు అది మతపరమైనదా? కాదా? అన్నదే మాకు కావాలి’ అని పేర్కొంది. నాగరిక క్రమంలో ఎన్నో భవనాలను కూల్చేస్తున్నారని, వాటి స్థానంలోనే కొత్త వాటిని నిర్మిస్తున్నారని పేర్కొన్న సుప్రీంకోర్టు.. మసీదు నిర్మాణానికి ముందు ఈ ప్రాంతంలో ఆలయం ఉండేదా? లేదా? అన్నదానిపై తమకు ఆధారాలు కావాలని స్పష్టం చేసింది.

ఈ 2.77 ఎకరాల వివాదాస్పద స్థలంపై తమ హక్కులను ధ్రువీకరించుకోవడానికి భారత పురావస్తు శాఖ నివేదికలను కూడా ఆయన ఉటంకించారు. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య వివాదంపై రోజువారీ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారం క్రీస్తుపూర్వం రెండో శతాబ్దంలోనే ఈ స్థలంలో భారీ రామాలయం, అలాగే, స్తంభాలు కూడా ఉన్నాయని ఈ హిందూ సంస్థ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోర్టుకు వివరించారు. ఈ స్థలంలో ధ్వజస్తంభాలతో పాటు మండపం కూడా ఉందని ఏఎస్‌ఐ నివేదిక తిరుగులేని రీతిలో వెల్లడించిందన్నారు.