ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్న 1980, 1990 దశాబ్దాల కాలంలో ‘ఎన్టీఆర్’ అన్నమాట జర్నలిస్టులకు విందులా అనిపించేది. ఎందుకంటే ప్రజలలో ఆయనకున్న ఆదరణ, ఆకర్షణ అలాంటిది. ఆయన ఏం చేసినా అదొక వార్తే. ఏమీ చెయ్యకపోయినా అదీ ఒక వార్తే. ఒకవేళ ఎలాంటి వార్తా లేకపోతే దానికి కూడా ఎన్టీఆర్ అని ముద్దుపేరు పెట్టుకున్నారట 1990వ దశకం నాటి జర్నలిస్టులు. ఎన్టీఆర్ అంటే నథింగ్ టు రిపోర్టు (Nothing To Report) అని అర్థమట.

ఈ విషయాలను నాటి జర్నలిస్టు ఒకాయన ఆయనను గుర్తుచేసుకుంటూ 2013లో ‘ఫస్ట్ పోస్ట్’ అనే వెబ్ పోర్టల్‌కు ఆంగ్లంలో రాసిన వ్యాసంలో చెప్పుకొచ్చారు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఫోటోలకు ఫోజులివ్వడం పరిపాటి. అలాంటి సందర్భాలలో ఫోటో తీసుకునే ఫోటోగ్రాఫర్‌కు లైటింగ్ విషయంలో సూచనలిచ్చేవారట ఎన్టీఆర్.

ముఖం మీద, భుజాల మీద నీడలు పడకుండా లైట్లను సరిచేయించే వారంట. సినిమా రంగం నుంచి వచ్చిన సూపర్ స్టార్ కాబట్టి కెమరాకు ఎలా ఫోజివ్వాలో ఆయనకు బాగా తెలిసేది. చిన్న చిర్నవ్వు, ఒక చేతిని ముందుకు చాచి ఉండేలాంటి భంగిమలో ఆయన కెమెరాకు ఇచ్చిన ఈ ఫోజు చాలా ప్రజాదరణ పొందింది. ఎన్టీఆర్ విగ్రహాలను ఎక్కడ నెలకొల్పినా దాదాపు ఇదే భంగిమలో ఉంటాయి ఆయన ప్రతిమలు.