హైదరాబాద్: విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నాగబాబు నట వారసుడు వరుణ్ తేజ్ మరో సినిమాతో మన ముందుకు వచ్చాడు. ముందు ‘వాల్మీకి’గా ప్రచారం జరిగి, తర్వాత గద్దలకొండ గణేష్‌గా మారిన చిత్రం శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఒక స్పేస్ థ్రిల్లర్, ఒక రొమాంటిక్ కామెడీ చేసిన తర్వాత వరుణ్ పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చూపించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జనాలను ఎంతవరకూ మెప్పించిందో చూద్దాం. కథలోకి వెళ్తే… అభి (అథర్వ) దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు.

దర్శకుడు అవ్వాలంటే ఒక గ్యాంగ్‌స్టర్ కథ కావాలని నిర్మాత కోరడంతో నిజ జీవితంలో గ్యాంగ్‌స్టర్ అయిన గడ్డలకొండ గణేష్ (వరుణ్ తేజ్)ను దగ్గరుండి పరిశీలించి తన కథే రాయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్‌లో అభి ఎదుర్కొన్న సవాళ్లేంటి? తను అనుకున్నట్లు కథ రాయగలిగాడా? గద్దలకొండ గణేష్ అలియాస్ గని ఎందుకు గ్యాంగ్‌స్టర్‌గా మారాడు? ఈ విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. టాలీవుడ్‌లో వరుణ్ తేజ్ ప్రయాణం చూడముచ్చటగా ఉంది. ఒక సినిమాకి మరొక సినిమాకి సంబంధం లేకుండా తను ఎంచుకుంటున్న సినిమాలు తననొక వెర్సటైల్ నటుడిగా నిలబెడతాయనడంలో సందేహం లేదు.

వాల్మీకి చిత్ర ఒరిజినల్ వెర్షన్ జిగర్తాండలో బాబీ సింహా వరుణ్ తేజ్ చేసిన పాత్ర చేసాడు. అక్కడ అతను చెలరేగిపోయాడు. జాతీయ స్థాయి అవార్డు కూడా వచ్చింది. మరి అలాంటి పాత్రను వరుణ్ తేజ్ ఎన్నుకోవడమే సాహసం. అయితే వరుణ్ ఆ పాత్రకు తన గెటప్‌ను మార్చుకున్న తీరుకే హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. చూడగానే ఒక విలన్‌ని చూస్తున్నామన్న భావన తీసుకురాగలిగాడు. ఇక సినిమా విషయానికి వస్తే హరీష్ శంకర్ ప్రధాన బలం ఎంటర్టైన్మెంట్. ఆ విషయంలో ఈ సినిమా నిరాశపరచదు. సినిమా మొదలైన కాసేపటికే మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా రేసీగా సాగిపోతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయి.

సెకండ్ హాఫ్‌పై మరిన్ని అంచనాలు ఏర్పడేలా చేస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌లో వాల్మీకి తడబడుతుంది. సెకండ్ హాఫ్ మొదలవ్వడం బాగున్నా తర్వాత బాగా డల్ అయిపోయింది. హరీష్ శంకర్ ఒరిజినల్‌లో లేని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను ఇందులో యాడ్ చేసాడు. ఈ ఎపిసోడ్ బాలేదు అనిపించదు, అలాగని సూపర్ అని కూడా అనిపించదు. అలా వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఎల్లువొచ్చి గోదారమ్మ పాట మాస్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల గద్దలకొండ పాత్ర సోల్ దెబ్బతింది. ఆ పాత్రను హీరోలా చూపించడం వల్ల పాత్ర ఔచిత్యం దెబ్బతింది.

ఆ ఎఫెక్ట్ ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్‌పై పడింది. ముందే చెప్పుకున్నట్లు వరుణ్ తేజ్‌కి ఇది కెరీర్‌లో బెస్ట్ రోల్ అని చెప్పవచ్చు. తన ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఇలా అన్నిట్లో వైవిధ్యం చూపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ వరుణే. తమిళ నటుడు అధర్వ బాగానే చేసాడు. ఒరిజినల్ తో పోలిస్తే ఇందులో తన పాత్రను కొంచెం తగ్గించేశారు. డబ్బింగ్ అధర్వకి సూట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. పూజ హెగ్డే ఉన్నంతలో అలరించింది. మృణాళిని ఆకట్టుకుంటుంది. బ్రహ్మాజీ మరోసారి తన కామెడీ టైమింగ్‌తో దుమ్మురేపాడు. సత్య ఓకే. తనికెళ్ళ భరణి పాత్ర బాగుంది.

వాల్మీకి చిత్రంలో ముందుగా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించే. ఇప్పటిదాకా తన కెరీర్‌లో క్లాస్ ఆల్బమ్స్ అందించిన మిక్కీ తొలిసారి మాస్ సినిమాకి పనిచేసాడు. పాటలు పర్వాలేదు అనిపించినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా వాకా వాకా అని వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ అదిరిపోతుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్‌గా ఉండొచ్చు. సెకండ్ హాఫ్‌లో ఫ్లో దెబ్బతింది. డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలం. వాల్మీకి వరుణ్ తేజ్ కెరీర్‌కు ప్లస్ అయ్యే సినిమానే. హరీష్ శంకర్ సెకండ్ హాఫ్ విషయంలో మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టకపోయి ఉంటేనే బాగుండేదేమో అనిపిస్తుంది.

అయినా అది బాగోలేదని కాదు, సినిమాకు అవసరం లేదు. మొత్తానికి వాల్మీకి ఒకసారి హ్యాపీగా చూడదగ్గ చిత్రం. మాస్ చిత్రం కాబట్టి ఈ సినిమా కలెక్షన్ రేంజ్‌ను ఇప్పుడే చెప్పలేం. హిట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. హరీష్ శంకర్ రాసిన డైలాగులు కూడా థియేటర్‌లో బాగా పేలాయని మరికొందరు అంటున్నారు. తెలంగాణ యాసలో మాస్ డైలాగులను వరుణ్ తేజ్ సూపర్బ్‌గా చెప్పారట. దీనికి తోడు మిక్కీ జే మేయర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో బలమని చెబుతున్నారు. ఫస్టాఫ్ చాలా బాగుందని, ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ అదిరిపోయిందని ట్వీట్లు చేస్తున్నారు. మొత్తంగా ‘సూపర్ హిట్టు బొమ్మ హిట్టు’ అనే టాక్ బాగా వినిపిస్తోంది. ఈ సినిమాను అమెరికాలోని పలు నగరాల్లో ప్రీమియర్స్‌ను వేసింది చిత్రబృందం.

దీంతో టాక్ బయటకు వచ్చేసింది. సినిమాను అక్కడ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికల ద్వారా సినిమాపై తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. గద్దలకొండ గణేష్‌గా వరుణ్ ఎలా చేశాడు.. సినిమాలో మార్పులు గద్దలకొండ గణేష్‌కు ఉపయోగపడ్డాయా? సినిమాపై వారి కామెంట్స్, సినిమా టాక్ ఎంటో చూస్తే గద్దలకొండ గణేష్ తమిళ రీమేక్ సినిమా అయినప్పటికీ ఒరిజినల్ కథలో ఉన్న పాత్ర కంటే విభిన్నంగా వరుణ్ అదరగొట్టాడని సమాచారం. హరీష్ శంకర్, వరుణ్‌ను మాస్ లుక్‌లో సూపర్‌గా చూపించాడని టాక్.

పూజా హెగ్డే కూడా తన రేంజ్‌కి తగ్గట్టు ఉన్నది కొద్దిసేపైనా అదరగొట్టిందని ముఖ్యంగా ఈ జంట ఆడిపాడిన అప్పటి హిట్ సాంగ్ వెల్లువచ్చి గోదారమ్మా పాటలో ఇద్దరూ చంపేశారని తెలుస్తోంది. మరో ముఖ్య పాత్రలో నటించిన అధర్వ కూడా బాగానే చేశాడని తెలుస్తోంది. దీనికి తోడు మిక్కీ జే మేయర్ సంగీతం, బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయిందని టాక్.