పత్తిరైతను కంటే దారుణమన పరిస్థితి

‘విపత్తు’ను గట్టెక్కేందుకు ఎదురుచూపులు!

తెలుగు రాష్ట్రాల్లో చేనేత రంగం మరోమారు సంక్షోభంలో చిక్కుకుంది. గతంలో పత్తిరైతుకు ఎదురైన కష్టాలకంటే కూడా నేడు నేతన్నను సమస్యలు చుట్టుముట్టాయి. ఎగుమతులపై రాయితీలను రద్దు చేస్తున్న స్థితిలో పత్తి రైతే కాదు, నేతన్న బతుకూ ఛిద్రమయ్యే ప్రమాదం దాపురించిందన్న ఆందోళనలు ఒకపక్క వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో పత్తి రైతు భవిష్యత్తు అగమగ్యగోచరం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా పత్తి ధరలు తగ్గిన తరుణంలో ఎగుమతులపై రాయితీని రద్దు చేయటంతో భారతదేశంలో ఉత్పత్తి జరిగే పత్తి ధర పెరగటం అనివార్యం.

అదే జరిగితే ఇతర దేశాలు తక్కువ ధరకు లభించే దేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకుంటాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్వాకంతో దేశంలోని పత్తిరైతుకు ఉరి బిగించే పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. దేశంలో గుజరాత్‌, మహారాష్ట్ర, తరువాత తెలుగురాష్ట్రాల్లోనే అత్యధికంగా పత్తి సాగు జరుగుతోంది. అయితే తెలంగాణ మూడో స్థానంలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌ ఐదో స్థానంలో నిలుస్తోంది. గుజరాత్‌ అత్యధికంగా 108 లక్షల బేళ్లను ఉత్పత్తి చేస్తే, మహారాష్ట్ర 83 లక్షల బేళ్లను, తెలంగాణ 57 లక్షల బేళ్లు, కర్ణాటకలో 30 లక్షల బేళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో 27 లక్షల బేళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే తాజా నిర్ణయాలతో తెలుగు రాష్ట్రాల పత్తి రైతులకు మరణశాసనం విధించినట్టే. ఇప్పటికే వర్షాలు పడక, దిగుబడి రాక వేలాది మంది పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

అధిక ఉత్పత్తి సాధించటానికి బీటీ విత్తనాలను విత్తుతున్నారు. విత్తనాల పెట్టుబడితో పాటు సస్యరక్షణ రైతు ప్రాణం మీదకు తెస్తున్నాయి. సకాలంలో విత్తటానికి విత్తనాలను సంపాదించటం ఓ క్రతువు కాగా, ఆ తరువాత తెల్లదోమ నివారణకు క్రిమిసంహారక మందులకు పెట్టుబడి పెట్టేందుకు అప్పుల కోసం పరుగులు తీయక తప్పదు. తీరా పంట చేతికి వస్తే ధర అమాంతంగా పడిపోతోంది. ఇక రైతుకు మద్దతు చెల్లించేందుకు సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాయాజాలం అంతా ఇంత కాదు. రైతు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేయదు. ఉదాహరణకు తెలంగాణలో 57 లక్షల బేళ్లు ఉత్పత్తి జరిగితే 35 లక్షల బేళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. ఆంధ్రాలో 10 లక్షల బేళ్లే కొనుగోలు చేసింది.

ఇలా ప్రతి ఏటా నష్టాల సాగుతో సతమతమవుతున్న స్థితిలో అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వమే పత్తి రైతన్న ప్రయోజనాలను ప్రపంచ వాణిజ్య సమాఖ్య సమావేశంలో పణంగా పెట్టింది. పత్తి ఎగుమతులపై రాయితీలను రద్దు చేసేందుకు అంగీకరిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ నైరోబీ సమావేశంలో సంతకం చేయటంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రంలో పత్తిసాగు నుంచి వైదొలగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా రైతులను కోరారు. రాష్ట్రంలో 88.90 లక్షల ఎకరాల్లో సాగుజరుగుతుంటే అత్యధికంగా 42.42 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతోంది.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోనే పత్తిసాగు ఎక్కువ. ఇక్కడ వాతావరణ పరిస్థితిలు పత్తి పంటకు అంతగా అనుకూలంగా లేవు. వర్షాభావ పరిస్థితులు, తెగుళ్ల వ్యాప్తి ఇక్కడి రైతును కుంగదీస్తున్నాయి. మిగిలిన పంటలతో పోల్చితే పత్తిసాగులో లాభాలు ఎక్కువగా ఉన్నందున సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం బీటీ విత్తనాలతో సాగు చేస్తున్నారు. ఈ రకం వంగడానికి గులాబీ రంగు పురుగు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తోంది. మున్ముందు ఈ పురుగు మరింత విస్తరించే ప్రభావం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ స్థితిలో తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎంత తగ్గితే అంత లాభమని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తోంది. మరోవైపు, పత్తిరైతుకు చుట్టూ ఉచ్చుబిగుస్తున్న స్థితిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

పత్తిసాగు విస్తీర్ణం పెంచాలా? వద్దా? అనే అంశంపై దృష్టి సారించలేదు. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువ విస్తీర్ణంలో జరుగుతోంది. సుమారు 22 లక్షల ఎకరాల్లో ఏటా 27 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి జరుగుతోంది. ఓ వైపు తెలంగాణలో విస్తీర్ణం తగ్గితే ఆంధ్రా రైతులకు గిరాకీ పెరుగుతుందని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాలో అనేక జిన్నింగ్‌ మిల్లులు మూతపడ్డాయి. రుతుపవనాలు సహకరించటం లేదు. కోస్తా ప్రాంతంకావటంతో తుపానులు సర్వసాధారణమే. తెలంగాణలో అనావృష్టితో రైతులు నష్టపోతే, ఇక్కడ అతివృష్టితో దెబ్బతింటారు. ఈ స్థితిలో ఆంధ్రపద్రేశ్‌లో ఇప్పటి వరకూ పత్తిపై ఓ విధానం వ్యక్తం కాకపోవటంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పత్తి పంటపైనే ఆధారపడిన నేతన్నకు ఇబ్బందులు తప్పవు. తెలంగాణలో ఉత్పత్తి తగ్గితే నేతన్నల చేతికి పని కష్టమే.

తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40 లక్షల మంది నేతకార్మికులు ఉన్నారు. ఏటా 400 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తారు. తెలంగాణలో కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో అత్యధికంగా నేతకార్మిక కుటుంబాలు ఉన్నాయి. కేవలం సిరిసిల్లాలోనే 60 వేల కుటుంబాలు ఉన్నాయి. పత్తి సాగు తగ్గిన స్థితిలో నేత కార్మికుల ఉపాధిపైనా ప్రభావం పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో నేత కార్మికులు ఉన్నారు. ఈ స్థితిలో అటు పత్తి రైతు, అతడిపై ఆధారపడిన నేతన్నను కాపాడే దిశగా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు చంద్రులు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.