• వారు గర్వించే స్థానానికి ఎందగండి: ఏయూ వీసీ

  • లక్ష్మ్యం లేని వారే నిజమైన పేదవారని వ్యాఖ్య

  • ఉన్నత విలువలతో ముందుకు సాగాలని పిలుపు

  • ఎన్‌ఎస్‌ఎస్‌ స్వర్ణోత్సవ సభలో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి

విశాఖపట్నం, సెస్టెంబర్ 25 (న్యూస్‌టైమ్): ప్రతీ విద్యార్థికి తల్లిదండ్రులే నిజమైన రోల్‌ మోడల్స్‌ అని, వారు గర్వించే స్థాయికి యువతరం ఎదగాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఏయూ టీఎల్‌ఎన్‌ సభా మందిరంలో నిర్వహించిన జాతీయ సేవా పథకం స్వర్ణోత్సవ సంబరాలలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రాంగణం వెలుపల మెక్కలు నాటారు, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోలేని వారే నిజమైన పేదవారని, యువత తమ లక్ష్యాన్ని స్థిరపరచుకుని, ప్రణాళికా బద్దంగా దానిని చేరుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఉన్నత వ్యక్తిత్వమే మనకు నిజమైన ఆస్థిగా నిలుస్తుందని, బాధ్యతాయుత పౌరులుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.

యువత వ్యసరాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యతను ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు స్వీకరించాలన్నారు. ప్రధానంగా అమ్మఒడి పథకంపై గ్రామాలలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో సద్వినియోగం కావాలని, లబ్దిదారులకు అవి చేరాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన రెడ్డి అమలు చేస్తున్నారన్నారు.యువతకు పూర్తిస్తాయిలో ఉపాదిని కల్పించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పూర్వ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ పి.రామచంద్ర రావు మాట్లాడుతూ సానుకూల దృక్పధాన్ని విద్యార్థులు కలిగి ఉండాలని సూచించారు.

ఐదు దశాబ్ధాల క్రితం 40 వేల మందితో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఎస్‌ నేడు 50 లక్షల మంది సభ్యులతో అతిపెద్ద సేవా విభాగంగా నిలుస్తోందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త ఆచార్య ఎస్‌.హరనాథ్‌ మాట్లాడుతూ విద్యార్థుల సామర్ధ్యాలను వెలికితీసే వేదికగా జాతీయ సేవా పథకం నిలుస్తోందన్నారు. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి ఉపకరించే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయిలో, విశ్వవిద్యాలయం స్థాయిలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు, వలంటీర్లకు ప్రశంసా పత్రాలను ప్రధానం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారిణి ఇ.పి.ఎస్‌ భాగ్యలక్ష్మి, డాక్టర్‌ ఎన్‌.వి.యస్‌ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 44 సంవత్సరాలుగా ఎన్‌ఎస్‌ఎస్‌కు విశిష్ట సేవలు అందించిన డాక్టర్‌ పి.రామచంద్రరావును సత్కరించి, జ్ఞాపిక బహూకరించారు.