ఒంగోలు, అక్టోబర్ 3 (న్యూస్‌టైమ్): చరిత్ర ప్రారంభం నుంచి ఎంతో వైభవంగా పేరు ప్రఖ్యాతులతో తమ కుటుంబాల ఆకలి తీర్చిన కుల వృత్తులు, నేటి పారిశ్రామిక యుగంలో కనుమరుగవుతున్న దారుణ పరిస్థితి నెలకొనివుంది. సమాజంలో ఒక వృత్తిపై మరో వృత్తి ఆధారపడే విధంగా జీవనచక్రం సజీవంగా సాగేందుకు వృత్తులు ఏర్పడ్డాయి. అవే వృత్తులు ఆధారంగా అగ్రవర్ణ మేధావులు తమ కుటిల యత్నాలకు తమ వారసుల భవిష్యత్తు కోసం వృత్తి ఆధారంగా కులాలను సృష్టించి కులవృత్తుల ప్రజలను బానిసలుగా మార్చి తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం చరిత్ర అందిస్తున్న వాస్తవం.

గ్రామాల్లో వృత్తులు లేనిదే ప్రజాజీవనం లేదన్న విధంగా పెనవేసుకున్న వృత్తులు కనుమరుగయ్యే స్థితికి చేరుకున్నాయి. సాలెలమగ్గం, కుమ్మరి చక్రం, జాలరి వల, రజక బండ, మంగలి చురకత్తి, కంసాలి బాడిషా చేతివృత్తులతో పాటు యాచక వృత్తిని చేసుకొని సంచార జీవితం గడుపుతూ పండుగలకు, పబ్బాలకు గ్రామాల్లో తిష్టవేసి అక్షరజ్ఞానం లేకున్నా సరస్వతి కృపతో అబ్బురపరిచే విన్యాసాలు, పదాల పదనిసలు కుల పురాణాలు చెప్పే జంగమ, డక్కలి, హరిదాసులు బుర్ర కథలు, తోలుబొమ్మలాట తదితర వృత్తులు శతాబ్ధం క్రితమే కనుమరుగయ్యాయి.

స్వాతంత్య్రానికి పూర్వం గ్రామాల్లో కొనసాగిన చేతివృత్తులు ప్రస్తుతం కనుమరుగయ్యే స్థితిలో ఉండి ఆకలితీర్చలేని కులవృత్తి మనకు అవసరమా అని నేటితరం వారసులు ప్రశ్నిస్తూ విముఖత చూపుతున్న పరిస్థితి నెలకొనివుంది. ఇత్తడి, స్టీల్‌ రావడంతో కుండలకు గిరాకి తగ్గింది. వేసవిలో లేదా కర్మకాండల సందర్భంగానే కుండలను వినియోగిస్తున్నారు. గ్రామాల్లో ఏ ఒకరో ఇద్దరో తప్పించి అధికశాతం మంది ఇతర వృత్తులలోకి జీవనం కోసం వలస వెళ్లారు. ట్రాక్టర్లు, యంత్ర పరికరాలు రావడంతో గ్రామంలో వడ్రంగి బాడిషా తుప్పుపట్టి అటకెక్కింది.

ఒకనాడు వడ్రంగి ఇంటివద్ద గ్రామస్తులంతా తమ వ్యవసాయ పనిముట్లు తయారీకై వరుసపెట్టి కూర్చోని కబుర్లు చెప్పుకునేవారు నేడు వడ్రంగుల ఇళ్లు పాడుపడి జీవనం కోసం గ్రామం నుంచి సంపూర్ణంగా పట్టణాలకు వలస వచ్చారు. ఇక బ్రాంది, విష్కీ, రమ్ము, జిన్ను రంగ ప్రవేశంతో గీత కార్మికులు కల్లుకు గిరాకి లేక ఉపాధి ఏనాడో కోల్పోయారు. మిల్లు విస్త్రాలు రాజ్యమేలుతున్న వ్యవస్థలో సాలెల మగ్గం గిటకబారి చేనేత కార్మికులకు ఆకలి మంటలు, ఆత్మహత్యలు బహుమతిగా అందిస్తున్న దారుణ పరిస్థితి ఉంది. నాయీ బ్రాహ్మణులు పెళ్లిళ్ల సమయం మినహాయించి ఇతర సమయంలో ఉపాది కరువవడంతో గ్రామాల్లో ఉన్న రెండు మూడు ఇళ్లు కూడా పట్టణాలకు వలస వచ్చి సెలూన్‌లు ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు.

ఇక బుడగ జంగాలు, హరిదాసులు భూతద్దం వేసి వెతికినా కన్పించని దారుణ పరిస్థితి నెలకొనివుంది. హైటెక్‌ కుంకుమ బొట్టుబిల్లలు రావడంతో గ్రామాల్లో తిరిగే కుంకమ దాసర్లు కనుమరుగయ్యాయి. సినిమాలు, టీవీల ప్రభావంతో, బుర్రకథ, హరికథ కాలక్షేపాలు అటకెక్కి ఎంతో కాలమైంది. చరిత్రలో తొలి రసాయనిక ఇంజనీర్లు అయినా మాదిగలు బాట చెప్పుల రాకతో పట్టణాల్లో రోడ్ల పక్కన పాత చెప్పులు కుడుతూ తమ బ్రతుకును వెతుకుతున్న పరిస్థితి ఆవేదన కల్గిస్తుంది. మరోవైపు ఇక రజకులు గ్రామాల్లో కులవృత్తి చేస్తున్నా అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ ఈ వృత్తి మాకొద్దని మా బిడ్డలను ఆకలి చాకలిబండకు బలిచేయవద్దనే నినాదంతో ఉన్నారు.

యంత్రాల రాకతో బండలను కొట్టి శ్రమతో జీవనం సాగించిన వడ్డెరలు, ఇతర వృత్తులోకి వసల వెళ్తున్న పరిస్థితి నెలకొనివుంది.సెంచరీ పరుపుల రాకతో దూదితో అందమైన పరుపులు కుట్టి అందమైన జీవనం సాగించిన దూదేకుల సామాజిక వర్గం వృత్తిని కోల్పోయింది. వృత్తులు మాయమైనా వృత్తుల ఆధారంగా ఏర్పడిన కులాల ప్రాతిపదికన ఆ వృత్తుల సామాజిక వర్గ ప్రజలు రాజకీయంగా, సామాజికంగా ఆర్థికంగా వెనుకపబడిన పరిస్థితి నెలకొనివుంది.

జనాభాలేని రజక, నాయీబ్రాహ్మన, వడ్డెర, జంగమ, కుమ్మరి, జంగమ, మేధరి, తదితర వృత్తుల వారు నిరంతరం అవమానాలను ఎదుర్కొంటూ ఆత్మాభిమానం అంటే మనసు అంతర్భాగంలో బాధతో కుంగిపోయ అనే మాటల ఎదురు చెప్పలేక అవమానాలను దిగమింగలేక తమ వారసులకు భవిష్యత్తు ఎలా అని నిరంతరం మానసికంగా కుంగిపోతూ కుల వ్యవస్థను రూపొందించిన వారెవరైనా మానవులు అయితే వారికి మనస్సాక్షి ఉంటే ఇలాంటి విషాలను విరజిమ్మే కుల వ్యవస్థను రూపొందిస్తారా అని మౌనంగా తమ మనసుల్లో మాట బయటకు పొక్కకుండా మౌనంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏ చేతివృత్తుల వారికి రాకూడదు.