అమరావతి, అక్టోబర్ 5 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి పదవుల పంపకంలో తన సామాజిక వర్గానికి ప్రాధాన్యత కొనసాగిస్తూనే వస్తున్నారు. పదవుల భర్తీలోనూ అన్ని వర్గాలకు సమాన అవకాశాలని ఒకపక్క చెబుతూనే వస్తున్న జగన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా తన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీనాథ్ రెడ్డిని నియామించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో జర్నలిస్ట్‌గా సుధీర్ఘ కాలంగా పని చేశారు శ్రీనాథ్‌రెడ్డి. ఉమ్మడి ఏపీలో ఏపీయూడబ్ల్యూజేలో వివిధ హోదాల్లో పని చేసారు ఆయన. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రులు ఎంవీ మైసూరారెడ్డి, జెసి దివాకర్‌రెడ్డిలతో కలిసి రాయలసీమ సమస్యలపై ఉద్యమాలు కూడా చేశారు. రాయలసీమ ఉద్యమంలో కీలకంగా పని చేసిన సీనియర్ జర్నలిస్ట్‌గా శ్రీనాథ్‌రెడ్డికి పేరుంది. శ్రీనాథ్‌రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల మండలం కోరగుంట పల్లె గ్రామం.

మొత్తానికి జగన్‌ను నమ్ముకున్న ఆయన సామాజిక వర్గానికి ఎక్కడా ఎలాంటి నష్టం జరగడం లేదని తాజా నియామకంతో మరోసారి రుజువైంది. ప్రెస్ అకాడమీ అధ్యక్ష పీఠంపై రాష్ట్రానికి చెందిన చాలా మంది సీనియర్లు కన్నేసి ఉన్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ శ్రీనాథ్‌రెడ్డిని ఎంపిక చేయడం ఆశావహులపై నీళ్లు జల్లినట్లయింది.