విజయవాడ, అక్టోబర్ 5 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ రాజధాని నుంచి హైదరాబాద్‌ (కేపీహెచ్‌బీ)కు సాధారణ చార్జీ రూ. 660. అదే పండగ సందర్భంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో స్పెషల్‌ చార్జీ రూ. 990. రాష్ట్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నానికి సాధారణ చార్జీ రూ. 870. కానీ, ప్రత్యేక చార్జీ రూ. 1305. అదే మహా పుణ్యక్షేత్రమైన తిరుపతికి సాధారణ చార్జీ రూ. 960. స్పెషల్‌ ఫేర్‌ రూ. 1440. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సాధారణ చార్జీ రూ. 400. స్పెషల్‌ ఫేర్‌ రూ. 600. ఇలా చెప్పుకొంటూ పోతే తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ముఖ్య ప్రాంతాలకు దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక డొక్కు బస్సుల చార్జీలు ప్రయాణీకులకు గూబగుయ్యమనేలా చేస్తున్నాయి.

ప్రజల అవసరాన్ని ఎన్‌‘క్యాష్‌’ చేసుకునేందుకు ఆర్టీసీ అమలుచేస్తున్న 50 శాతం అ‘ధనం’ ప్రయాణీకుల నడ్డి విరుస్తోంది! అదనపు చార్జీ సంస్థకు కాసులు కురిపిస్తుంటే ప్రయాణీకులు మాత్రం నిలువు దోపిడీకి గురవుతున్నారు. విజయవాడ నుంచి దూరప్రాంతాలైన హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, వరంగల్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులలో వెళ్ళా లంటే మోత మోగుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే దూరప్రాంతాల నుంచి రాకపోకల కోసం షెడ్యూల్‌ బస్సుల్లో సీట్లకు ముందస్తుగా రిజర్వేషన్‌ జరిగిపోయింది.

దీంతో ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని 600కు పైగా ప్రత్యేక బస్సులను తిప్పటానికి ప్లానింగ్‌ చేశారు. సెప్టెంబరు 28నుంచి స్పెషల్‌ బస్సులకు సైతం అడ్వాన్స్‌ బుకింగ్‌ కల్పించారు. షెడ్యూల్‌ బస్సులలో సీట్లన్నీ హాటుకేకు మాదిరిగా బుక్‌ అయిపోవటంతో ప్రయాణీకులకు ప్రత్యేక బస్సులే గత్యంతరం అవుతున్నా యి. ప్రత్యేక బస్సులలో ఆర్టీసీ 50 శాతం అదనంగా చార్జీలను వసూలు చేస్తోంది. నిర్ణీత రూట్‌ మొత్తం చార్జీలో సగం చార్జీ అదనంగా కలిపి వసూలుచేయటం వల్ల పండగకు రాకపోకలు సాగించే ప్రయాణీకులకు పెనుభారంగా మారింది.

విజయవాడ నుంచి హైదరాబాద్‌ మార్గంలో ప్రధానంగా ఎంజీబీఎస్‌, కేపీహెచ్‌బీలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. విజయవాడ నుంచి ఎంజీబీఎస్‌కు అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.660గా ఉంది. దీనికి 50శాతం అదనం కలిపి ప్రస్తుతం రూ. 990వసూలు చేస్తున్నారు. ఇదే రూట్‌లో గరుడ బస్సులలో సాధారణ చార్జీ రూ.575గా ఉంటే ప్రత్యేకబస్సుల పేరుతో రూ.865 వసూలు చేస్తున్నారు. ఇదే రూట్‌లో ఇంద్రబస్సులలో సాధారణ చార్జీ రూ.500ఉండగా.. స్పెషల్‌ ఫేర్‌ మాత్రం రూ.750గా ఉంది. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.375 కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.565గా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌ రూట్‌లో కేపీహెచ్‌బీకి చూస్తే అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.700 ఉంటే స్పెషల్‌ ఫేర్‌ రూ.1050గా ఉంది.

గరుడలో సాధారణ చార్జీ రూ.610కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.915గా ఉంది. ఇంద్ర బస్సులలో సాధారణ చార్జీ రూ.535 కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.805గా ఉంది. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.400 ఉండగా స్పెషల్‌ ఫేర్‌ రూ.600గా ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం రూట్‌లో అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.870 కాగా, ప్రత్యేక చార్జీ రూ.1305గా ఉంది. గరుడ బస్సులలో సాధారణ చార్జీ రూ.690 కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.1035గా ఉంది. ఇంద్ర బస్సు లలో సాధారణ చార్జీ రూ.660గా ఉండగా ప్రత్యేక చార్జీగా రూ.990 వసూలు చేస్తున్నారు. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.495 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.745గా ఉంది. విజయవాడ నుంచి తిరుపతికి అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.960 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.1440గా ఉంది.

గరుడ బస్సులలో సాధారణ చార్జీ రూ.835 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.1255 ఉంది. ఇంద్ర బస్సులలో సాధారణ చార్జీ రూ.725 కాగా స్పెషల్‌ ఫేర్‌ రూ.1090గా ఉంది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం రూట్‌లో అమరావతి బస్సులలో సాధారణ చార్జీ రూ.400 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.600గా ఉంది. గరుడ బస్సు లలో సాధారణ చార్జీ రూ.325 కాగా, స్పెషల్‌ ఫేర్‌ రూ.490గా ఉంది. ఇంద్ర బస్సులలో సాధారణ చార్జీ రూ.310 కాగా స్పెషల్‌ చార్జీ 465గా ఉంది. సూపర్‌ లగ్జరీ బస్సులలో సాధారణ చార్జీ రూ.225కాగా ప్రత్యేక చార్జీగా రూ.340 వసూలు చేస్తున్నారు.