నల్గొండ, అక్టోబర్ 5 (న్యూస్‌టైమ్): హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘తీన్మార్’ మల్లన్న ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నిన్న ప్రారంభించిన ఆయన ప్రచార పాదయాత్ర ఈనెల 19వ తేదీ సాయంత్రం వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా మల్లన్న ప్రతి ఇంటికి వెళ్లే కార్యక్రమం చేపట్టారు. ఉదయం మట్టపల్లి గ్రామం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు. రామచంద్రాపురం బీమ్లాతండా, బోజ్యతాండ, కృష్ణతండ, గుర్రంబోడు తండ, సుల్తాన్‌పూర్ తండ, పెదవీడు, మఠంపల్లి, రఘునాథపాలెం, వెంకటాయపాలెం, గుండ్లపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర జరిగింది.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న చీకటి రాజకీయాలను ప్రజలకు తెలియజేసి, అనైతిక అంతర్గత పొత్తులకు పాల్పడుతున్న కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల కుట్రలను బహిర్గతం చేయబోతున్నామన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఫక్తు ఆంధ్రా పార్టీగా మారిపోయిందన్నారు. అందుకే గుంటూరు ప్రాంతానికి చెందిన సైదిరెడ్డిని తెలంగాణ అసెంబ్లీలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధానం అనుసరిస్తున్నదని, రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉత్తం పద్మావతిని పోరాటాల పురిటిగడ్డ అయిన హుజూర్‌నగర్‌లో నిలబెట్టడం ఇక్కడి ప్రాంతాల ప్రజలను అవమానించడమేనని, తీన్మార్ మల్లన్న తాతల సమాధులు ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయని, సైదిరెడ్డి తాత సమాధి, ఉత్తం పద్మావతి తండ్రి తాత సమాధులు ఈ తెలంగాణ ప్రాంతంలో చూపించగలరా? అని ప్రశ్నించారు.

ఇప్పుడు ప్రజలు తీన్మార్ మల్లన్నకు అవకాశం ఇస్తే తన సమాధికూడా హుజూర్‌నగర్‌లోనే కట్టుకుంటానని, ప్రభుత్వ భూములను కబ్జాలు పెట్టి, అక్రమంగా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ దొంగల ముఠాలను తరిమి, ఇక్కడి ప్రాంత ప్రజలు కోల్పోయిన హక్కులను కాపాడే బాధ్యతను భుజాన వేసుకుంటానని హుజూర్‌నగర్ ప్రజలకు హామీ ఇస్తున్నానని మల్లన్న అన్నారు. ఇంటింటికి మల్లన్న పాదయాత్రలో భాగంగా మఠంపల్లి, మేళ్ల చెర్వు, గరిడేపల్లి, చింతలపాలెం, పాలకివీడు, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మండలాల్లోని ప్రతిగ్రామానికి గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి బహుజనల రాజ్యాధికారం అవసరాన్ని తెలియజేస్తూ వారిని ఓట్లు వేసే విధంగా అభ్యర్థించారు.

ఇప్పటికే హుజూర్‌నగర్ ప్రజలు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను పాతర పెట్టే పనిలో బిజీగా ఉన్నారని, తీన్మార్ మల్లన్న పాదయాత్ర తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా రావని తెలిపారు మల్లన్న. తనకు పిల్లలు లేరని, మీరే మా పిల్లలు అని చెప్పుకుంటున్న ఉత్తం పద్మావతి దంపతులు నిజంగా మీరు మమ్మల్ని పిల్లలుగా భావిస్తే తీన్మార్ మల్లన్ననే మీ బిడ్డగా భావించి ఎన్నికల నుంచి తప్పుకోవచ్చుకదా? 70 ఏళ్లుగా ఓడిపోతున్న హుజూర్‌నగర్‌లోని బీసీ, ఎస్సీ,, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను గెలిపించడమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న ముందుకు సాగబోతున్నారు.

ఈ ఎన్నికల యుద్ధం బహుజనులను 70 ఏళ్లుగా ఓడిస్తున్న అగ్రకుల పెత్తందార్లకు, నిజం తెలుసుకుని గర్జిస్తున్న 85 శాతం ఉన్న ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా విశ్లేషకులు భావిస్తున్నారు. మల్లన్న పాదయాత్రకు అన్నివర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు ప్రకటించబోతున్నారు. పాదయాత్రలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు.