నల్గొండ, అక్టోబర్ 5 (న్యూస్‌టైమ్): హుజూర్‌నగర్ ఉప ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు బీసీ, ఎస్సీ,. ఎస్టీ కులాల నుంచే కాక మేధావి వర్గం, జర్నలిస్టులు, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం విశేషం. హుజూర్‌నగర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి తెలంగాణ రాష్ట్రం మొత్తం తన వైపు చూసే విధంగా ఈ ఎలక్షన్లకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిన తీన్మార్ మల్లన్న ‘న్యూస్‌టైమ్’ ప్రతినిధితో పంచుకున్న ఆవేదనతో కూడిన ఆశయాలు.

‘‘ముందుగా భారత రాజ్యాంగానికి నా ధన్యవాదాలు. నాలాంటి పేదవాడు ఒక బలహీన వర్గాల జాతివాడు మదమెక్కిన అగ్రకుల దొరలపై ఎన్నికల యుద్ధంలో పాల్గొనే అవకాశం కల్పించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, భారత రాజ్యాంగానికి నా సెల్యూట్’’ అని అన్నారు.

‘‘హుజూర్‌నగర్ ఓటర్ మహాప్రభువులారా నేను ఒక జర్నలిస్టుని. ఒక పేద బీసీని, ఒక మాదిగ స్త్రీని కులాంతర వివాహం చేసుకుని జీవితం గడుపుతున్న వాడిని. నేను ఒక దశాబ్ద కాలంగా జర్నలిస్టుగా వివిధ టీవీలలో వార్తలు చదువుతున్న ‘తీన్మార్ మల్లన్న’గా మీకు తెలిసిందే. అదే క్రమంలో దోపిడికి గురైన పీడితుల పక్షాన ప్రతి సందర్భంలో నిరంతరం వారి గుండె ఘోషను నేను ప్రతిధ్వనిస్తున్నాను. అదే తృప్తిగా జీవిస్తున్నాను. ఆ క్రమంలో ఈ రాష్ట్రంలో అగ్రకుల దొరల దోపిడీ, ఆధిపత్యం, అహంకారం వారి రాజకీయ అవినీతి విశృంఖలంగా మారిపోయిన పరిస్థితులలో నేను నేను గత కొంతకాలంగా వారి బ్రతుకు మొత్తాన్ని ఆధారాలతో ఈ ప్రపంచం ముందు ఉంచాను. వారి విలువలు వలచి నడి బజార్లో నిలబెట్టాను. ఇదంతా ఈ సమాజంలో చాలామంది విద్యావంతులకు తెలుసు. ఇంక భయంకరమైన అగ్రకుల ఆధిపత్యం, అవినీతి, అక్రమాలు చేస్తుంది కేవలం వారి రాజకీయ అధికారంతోనే కదా ఆకుకూరలను పీకేస్తే వారి అవినీతి ఆధిపత్యం అంతమైపోతుంది కదా’’ అని పేర్కొన్నారు.

‘‘అందుకనే కదా ఈ నల్గొండ జిల్లా ఆవిర్భావం నుండి రిజర్వేషన్ సీట్లు తప్ప అన్ని నియోజకవర్గాల్లో అంతట మదమెక్కిన రెడ్లే కాదా! లక్షల మంది ఎస్సీ,, ఎస్టీ, బీసీలు ఓటర్లుగా మిగిలిపోతున్నారు కదా? మరి ఈ రాజకీయ ఆధిపత్యాన్ని ఎవరు నిలువరించాలి? ఎంతకాలం మన వారూ పల్లకీని మోయాలి? కాంగ్రెస్‌లో రెడ్లే, బిజెపిలో రెడ్లే, టిఆర్ఎస్‌లో రెడ్లే, టిడిపిలో రెడ్లే, కమ్యూనిస్టులు రెడ్లే. మన ఎస్సీ,, ఎస్టీ, బీసీ, మైనారిటీలం వారికి బానిసలమా? మన జీవితాన్ని మార్చడానికి ఒక దొర అయినా సాయపడ్డారా? అయినా పులిని మేక రక్షించమని కోరడం ఎంత తప్పో, అదే విధంగా మనకు అగ్రకుల దొరలు సహాయం చేస్తారనుకోవడం కూడా అంతే తప్పు’’ అని వ్యాఖ్యానించారు.

‘‘మరి ఆ పులి కోరలు పీకాలంటే ఆ పులి రాజకీయ అధికారాన్ని పీకేయాలి. అందుకే నేను అగ్రకుల దొరలపై రాజకీయం యుద్ధం చేయాలనుకుంటున్నాను. ఎస్సీ,, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓటర్ల మహాప్రభువులారా! అగ్రకుల ప్రజల ప్రజాస్వామికులారా! మనం ఎంత కాలం బానిసలుగా, అమ్ముడు పోయే వారిగా, పిరికి వారుగా బ్రతుకుదాం? రండి తిరగబడతాం. ప్రస్తుతం మీకు ఉన్న రాజకీయ ఆయుధం ఓటు. ఆయుధంతో అగ్రకుల దొర ని దింపడానికి నాకు ఓటు వేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. మన అణగారిన ఓట్లతో నేను ఆ దొరను ఓడించాలనికుంటున్నాను. మనమంతా కలిసి నిర్ణయం తీసుకుందాం. ఈ అవినీతి అగ్రకుల అనకొండలను అంతం చేద్దాం.మీరు మీ ఓట్లతో నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపండి. ఆ వేదిక నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్త దోపిడి పైన తిరుగుబాటు గళం వినిపిస్తాను. మొత్తం రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం. రండి మార్పు తెద్దాం రండి. మీ అంతరాత్మతో ఆలోచించి మీ అమూల్యమైన ఓటు నాకు వేస్తారని ఆశిస్తున్నాను’’ అని వేడుకున్నారు.