శ్రీనగర్, అక్టోబర్ 12 (న్యూస్‌టైమ్): జమ్మూ కశ్మీర్‌లో పూర్తిస్థాయి ఆంక్షల సడలింపు దిశగా మరో కీలక ముందడుగు పడింది. సోమవారం నుంచి కశ్మీర్‌లో పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం శనివారం కీలక ప్రటకన చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి పోస్ట్‌ పెయిడ్‌ మొబైల్‌ సేవలు ప్రారంభమవుతాయని, దీంతో రాష్ట్రంలో 99 శాతం ఆంక్షలు ఎత్తివేసినట్టు అవుతుందని రాష్ట్ర ప్లానింగ్‌ కమిషన్‌ ప్రధాన సెక్రటరీ రోహిత్‌ కన్సాల్‌ తెలిపారు.

నిజానికి శనివారం నుంచే పోస్ట్‌ పేయిడ్‌ మొబైల్‌ సేవలు ప్రారంభం కావాల్సి ఉండగా చివరి నిమిషంలో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల సోమవారానికి వాయిదా వేశారు. ఇక, ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఆందోళనలు చెలరేగకుండా కేంద్రం జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా కుదుటపడుతుండటంతో దాదాపు 90 శాతం ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది. దీంతో కశ్మీర్‌లో పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ తమవైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. ప్రధాని మోదీ ఆర్టికల్‌ 370 రద్దు చేసి దేశాన్ని ఒక్కతాటి కిందకు తెచ్చారని కొనియాడారు. కశ్మీర్‌లో ఒక్క బుల్లెట్‌ కూడా పేల్చకుండా కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేశామన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుపై రాహుల్‌, పవార్‌ అసత్య ప్రచారం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతున్నారని విమర్శించారు.

‘‘ఇండియాలో కశ్మీర్‌ అంతర్భాగం కావాలని దేశమంతా కోరుకుంటుంటే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడుతున్నాను. ఎందుకంటే ఓట్ల కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా’’ అని అమిత్‌ షా ప్రశ్నించారు. తమకు పార్టీ ప్రయోజనాల కంటే దేశమే ముఖ్యమని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై మనదేశం విజయం సాధించినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ముందుగా అటల్‌ బిహారీ వాజపేయి అభినందించారని గుర్తు చేశారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దేశం కోసం అధికార పక్షాన్ని అభినందించామన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌, ఎన్సీపీలు ఆర్టికల్‌ 370 రద్దు, సర్జికల్‌ స్ట్రైక్స్‌, బాలకోట్‌ వైమానిక దాడులను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.