• గ్యాస్ సిలిండర్ పేలి 11 మంది మృతి

మొహ్మదాబాద్‌(ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 14 (న్యూస్‌టైమ్): ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో వంటకు ఉయోగించే ఎల్పీజీ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో 11 మంది మృతి ప్రాణాలు కోల్పోగా 18 మంది తీవ్రంగా గాయపడ్డడారు. తూర్పు ఉత్తరప్రదేశ్ మావు జిల్లాలో సోమవారం ఉదయం సిలిండర్ పేలుడు కారణంగా ఇల్లు కూలిపోయింది. కడపటి వార్తలు అందే సమయానికి 18 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు గుర్తించినప్పటికీ శిధిలాలకింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయపడుతున్నారు.

పోలీసులు కథనం ప్రకారం, మావు జిల్లా పరిధిలోని మొహమ్మదాబాద్ ప్రాంతంలో రెండు అంతస్తుల ఇంటి లోపల ఒక సిలిండర్ పేలింది. పేలుడు ప్రభావం ఎంత బలంగా ఉందో చెప్పడానికి భవనం కూలిపోవడమే నిదర్శనంగా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలు పెద్ద శబ్దం వినగానే వెంటనే భవనం నుండి మంటలు చెలరేగాయని చెప్పారు. కూలిపోయిన ఇంటి స్థలంలో ప్రజలు శిధిలాలలో చిక్కుకున్నారో లేదో తెలుసుకోవడానికి సహాయక చర్య జరుగుతోందన్నారు.

ఆ స్థలంలో అంబులెన్స్‌లు, భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. కాగా, ప్రమాద ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబీకులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు, సంఘటనా స్థలంలో తగిన సహాయకచర్యలు తీసుకుని బాధితులను ఆదుకోవడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.