చమోలీ(ఉత్తరాఖండ్‌), అక్టోబర్ 14 (న్యూస్‌టైమ్): ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఎనమండుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వింతేమిటంటే వీరంతా మరొకరి అంత్యక్రియలలో పాల్గోవడానికి వెళ్తూ దుర్మణం పాలయ్యారు. చమోలీ జిల్లా దేవాల్ ప్రాంతంలో కైల్ నదిలో వాహనం పడడంతో ఎనిమిది మంది మరణించారు. ఘేస్ గ్రామ సమీపాన జరిగిన ఈ ఘటన ఇటు బాధిత కుటుంబాలను, అటు సహాయక చర్యలలో పాల్గోన్న వారినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, స్థానిక దేవల్‌ గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు 14 మందితో వెళ్తున్న జీపు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతి చెందారు. డ్రైవర్‌తో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జస్బీర్‌ సింగ్‌(32),సురేంద్ర సింగ్‌(30), మదన్‌ సింగ్‌(60), దర్బాన్‌ సింగ్‌(48), మదన్‌ సింగ్‌(38), కైలాష్ సింగ్‌(40), గోపాల్‌ సింగ్‌(35), ధరమ్‌ సింగ్‌(55)లు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. జై సింగ్‌ ధను (48) అనే వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ బేబీ రాణీ మౌర్య, ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

చమోలి జిల్లా తారాలి తహసీల్ పరిధిలోని దేవాల్ సమీపంలో ఆ ప్రమాదం జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు తెలియజేశారు. దీనిపై విచారం వ్యక్తంచేసిన సీఎం మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. గాయపడినవారిని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఆయన మెరుగైన వైద్యం కోసం అవసరం అయితే ప్రయివేటు ఆసుపత్రికి తరలించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడంతో పాటు గాయపడిన వారి చికిత్సకు సరైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రావత్ చమోలి జిల్లా మేజిస్ట్రేట్‌, కలెక్టర్‌ను ఆదేశించారు. మరోవైపు, వాహన ప్రమాదంపై మెజిస్టీరియల్ విచారణకు రావత్ ఉత్తర్వులు జారీచేశారు.