• విశాఖ పోలీసులకు చిక్కిన ఇద్దరు వ్యక్తులు

గోపాలపట్నం పోలీసుల అదుపులో ఉన్న గుడాల జగన్నాధ్, ఉషారాణి

విశాఖపట్నం, అక్టోబర్ 14 (న్యూస్‌టైమ్): విలేకరులమంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఒక మహిళ సహా ఇద్దరిని విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధి గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోపాలపట్నం సమీపంలోని శ్రీరామ్‌నగర్ ప్రాంతంలో రేకుల షెడ్డు నిర్మించుకుని పాన్ షాప్ నిర్వహించుకుంటూ జీవనోపాధి పొందుతున్న బొచ్చ. వెంకటరావు నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడడమే కాకుండా అతనిపై భౌతిక దాడికి కూడా పాల్పడ్డారని ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.

బాధితుల నుంచి అందిన సమాచారం మేరకు పోలీసులు శ్రీరామ్‌నగర్ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. గుడాల జగన్నాధ్, ఉషారాణి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం వాళ్లు ఏ మీడియాలోనూ పనిచేయడం లేదని తేలడంతో మరింత సమాచారం కోసం వారిని విచారిస్తున్నారు.

పట్టుబడిన ఇద్దరూ గతంలోనూ కొన్ని కేసుల్లో పట్టుబడ్డట్టు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. విలేకర్లమని చెప్పుకొని 10,000 రూపాయలు డిమాండ్ చేయడమే కాక బాధితుడిపై భౌతిక దాడి చేసినట్లు తెలుసుకున్న పోలీసులు వెంకటరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. విచారణ పూర్తయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని గోపాలపట్నం పోలీసులు చెప్పారు.