హైదరాబాద్, అక్టోబర్ 14 (న్యూస్‌టైమ్): ‘మెఘా’ కృష్ణారెడ్డి ఇంటిపై మెరుపు దాడులు జరిపిన ఆదాయ పన్ను శాఖ అధికారులు తమ సోదాలకు కొనసాగింపుగా లాకర్లను తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇళ్లు, కార్యాలయాలలో లభించిన పత్రాలను నిశితంగా పరిశీలిస్తూనే మరోవైపు, లాకర్లను తెరిస్తే మరింత సమాచారం లభిస్తుందని ఐటీ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లయింది. వరుసగా నాలుగో రోజు సోమవారం కూడా సోదాలు కొనసాగుతుండగా ఆయన భార్యకు సంబంధించిన లాకర్లు చెక్‌ చేయడానికి ఐటీ అధికారులు ఆమెను బ్యాంకుకు తీసుకెళ్లారు.

ఇప్పటికే ఇంట్లో భారీగా నగదుతో పాటు బంగారు, వజ్రాభరణలు దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. లెక్కలు, బిల్లులు లేని అభరణాల విషయంలో లాకర్లను తెరవబోతున్నట్లు తెలుస్తోంది. లాకర్లు ఓపెన్‌ చేస్తే మరిన్నీ అక్రమాస్తులు, వాటి తాలుకూ చిట్టా బయటపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి మెఘా కృష్ణారెడ్డి విషయంలో అనుకున్నదే అయింది. మాములు లెక్కలే అన్ని అని మెఘా ఎంత మొత్తుకున్నా కొండను తవ్వేందుకే వచ్చారు అన్నది అక్షరాలా నిజం అయింది. నాలుగు రోజులుగా మెఘాపై జరిగిన ఐటీ దాడుల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు వెళ్లింది? ఎలా వెళ్లింది? అనే మొత్తం డాటాను సేకరించింది ఐటీ.

మెఘా కార్యాలయాలు, ఇళ్లపై జరుగుతోన్న సోదాల్లో ఆఫీసుల్లో దొరికిన అంశాలపై మెఘా కృష్ణారెడ్డి ఇంట్లో దొరికన ఆధారాలతో పోల్చి చూస్తున్నారు ఐటీ అధికారులు. మొత్తం 110 కోట్ల రూపాయల బంగారు, వజ్రాల అభరణాలు దొరికినట్లు తెలుస్తోంది. భారీగా ఇంట్లో ఉన్న వజ్రాలు, బంగారు అభరణాల కొన్న బిల్లుల్లో అనేక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. 2017 ఏప్రిల్‌ 1 నుండి శ్రీకృష్ణ జ్యూవెలర్స్‌‌లో కొనుగోలు చేసిన నగలకు సంబంధించి రెండు బిల్లులు, 2018 మార్చి 31 నుండి మంగత్రాయ్ జ్యూవెలర్‌లో కొనుగోళ్లకు చెందిన మరో రెండు బిల్లులు, 2018 మార్చి 31 నుండి త్రిబువన్‌దాస్ జ్యూవెలరీ సంస్థలో జరిగిన లావాదేవీల్లో అవకతవకలపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

ఈ బిల్లులు, ఇంట్రో ఉన్న టన్నుల కొద్ది అభరణాలతో పాటు మెఘా సంస్థ ఐటీ పే చేసిన అన్ని పత్రాలను తవ్వి తీస్తున్నారు ఐటీ అధికారులు. ఇదిలావుండగా, మియాపూర్ టు ఒలెక్ట్రా వయా ప్రగతిభవన్… ఇదేదో బస్‌ రూట్ అనుకుంటున్నారా? బస్‌ రూట్ అయితే కాదు కానీ, బస్సులకు-మియాపూర్‌కు- ప్రగతిభవన్‌కు సత్సంబంధాలున్నాయని తెలుస్తోంది. మియాపూర్‌ భూముల కుంభకోణం దగ్గర నుండి నేటి ఆర్టీసీ గ్రీన్‌టెక్‌ ఎలక్ట్రిక్‌ బస్సుల వరకు జరిగిన అవినీతి పంపకాల బాగోతమిది. మియాపూర్‌లో భూముల కుంభకోణం జరిగింది. ఆ కేసులో గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్ సూత్ర, పాత్రదారి. కేసు నమోదు చేశారు. కానీ కేసు ఇక ఏమైందో తెలియదు.

కానీ అప్పట్లో ఆ విషయంలో భూమికి ఏమైంది. ఎడున్నదో ఆన్నే ఉన్నది అని కొట్టిపారేశారు సీఎం. 500-600 కోట్ల కుంభకోణం అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సడెన్‌గా కేసు సైలెంట్ అయిపోయింది. సీన్‌ కట్‌ చేస్తే, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కంపెనీ అయిన ట్రినీటీ ఇన్‌ఫ్రావెంచర్స్‌ కంపెనీని మెఘా సంస్థ టేకోవర్ చేసింది. అయితే, అందరికీ వచ్చే డౌటే ఇక్కడ ఐటీకి వచ్చి ఉంటుంది. మియాపూర్‌ భూముల కుంభకోణం అనంతరం మెల్లగా కేసు సైలెంట్ కావడానికి, మెఘా టేకోవర్‌ చేయడానికి మద్య జరగాల్సిందే జరిగింది. అందుకే రాత్రికి రాత్రి ట్రీనీటీ ఇన్‌ఫ్రావెంచర్స్‌ మెఘా చేతికి వెళ్లిపోయింది.

అందులో ఎవరి ఒత్తిడి ఉందో, మెఘా ఆత్మబంధు తెలంగాణ ప్రభుత్వ పెద్ద జోక్యం ఎంతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే, అలా గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్ కంపెనీ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మెఘా చేతికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కంపెని పేరు ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌గా మారిపోయింది. ఈ కంపెనీలో ప్రధాన వాటాదారుడు ప్రసాద్‌కు మైనర్‌ షేర్‌ మిగిలిపోగా, 50శాతానికి పైగా కంపెనీ మెఘా పరం అయింది. కొత్త కంపెనీల్లో పామిరెడ్డి రమారెడ్డి, పామిరెడ్డి పిచ్చిరెడ్డి తదితరులు డైరెక్టర్లుగా ప్రస్తుతం ఉన్నారు.

ఈ ఒలెక్ట్రా ద్వారానే మెఘా అండ్ కో ఆర్టీసీలోకి అడుగుపెట్టింది. మొదట్లో 40 బస్సులే సప్లై చేసినా రెండో ఫేజ్‌లో 300కు పైగా బస్సులను సప్లై చేయబోతున్నారు. క్రమక్రమంగా ఆర్టీసీలో ప్రైవేటు ఆదిపత్యం పెంచే ఉద్దేశ్యమే ఇదని, తద్వారా రానున్న రోజుల్లో ఎంతో విలువైన ఆర్టీసీ భూములను తమ పరం చేసుకోవాలన్నదే అంతిమ లక్ష్యమని ఆర్టీసీ కార్మిక సంఘాలంటున్నాయి.