• నానాటికీ పెచ్చుమీరుతున్న మెక్సికో ముఠాలు

మెక్సికో, అక్టోబర్ 15: ఆర్ధిక పరిస్థితులు అనుకూలంచక, పూట గడవక వ్యభిచారం రొంపిలోకి దిగిన మహిళల గురించి విన్నాం. కానీ, ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా పురుషులతో వ్యభిచారం చేయించే సంస్కృతి పెచ్చుమీరుతోంది. ముఖ్యంగా మెక్సికో ముఠాలు ఈ తరహా దందాను గుట్టుచప్పుడు కాకుండా నడిపిస్తున్నాయి. డబ్బు, ఇతర ఆశలు చూపి పురుషుల్ని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది.

‘‘ఇలాంటి విషయం గురించి మీతో మాట్లాడాలంటే చాలా బాధగా ఉంది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ యువకుడు ఆ దేశ మీడియాతో తన గాధను వెల్లబోసుకున్నాడు. తాను ఎన్నో వేధింపులకు గురయ్యానని మాత్రమే తొలుత అతను చెప్పాడు. అతని కళ్లలోకి చూస్తే అది అబద్ధమని తెలిసిపోతుంది. మాటలకు అందని బాధేదో అతని గుండెల్లో గూడు కట్టుకుని ఉందని అర్థమవుతుంది. చాలా రోజులు ప్రయత్నించింది ఆ అంతర్జాతీయ మీడియా సంస్థ అతని హృదయాంతరాలలోని చీకటిలోకి తొంగి చూడటానికి. కొన్ని నెలలు పట్టింది. అతను మనసు విప్పటానికి. మౌనం వీడటానికి. ఇంతకీ మెక్సికో ఎందుకు వచ్చావని ఆ యువకుడిని అడిగితే, ఒక అందమైన కల కోసం అని సమాధానం చెప్పడం గమనార్హం.

దక్షిణ అమెరికాను వదలినప్పుడు ఆ యువకుని వయసు 20 ఏళ్లు. మెక్సికోలో అడుగు పెట్టిన తరువాత అతని కలల సౌధం ఎలా కూలిపోయింది? భవిష్యత్తుపై కోటి ఆశలు ఉన్న ఆ కుర్రాడు ఎలా లైంగిక బానిసగా పురుష వేశ్యగా మారిపోయాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఆ యువకుడు ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న ఎల్ పోజో ది వీదా స్వచ్ఛంద సంస్థను ఓసారి సందర్శించాల్సిందే. అక్కడ ఉన్న ఇలియానా రువల్కాబా అతను నరక కూపంలో ఎలా కూరుకు పోయాడో కనులకు కట్టారు. ఇక్కమాటలో చెప్పాలంటే, అతనిది ఓ అందమైన రంగుల కల. గొప్ప నటుడు కావాలన్నదే జీవిత ధ్యేయం. తన ప్రతిభను నిరూపించుకునేందుకు మెక్సికో సరైన వేదికగా అతనికి అనిపించింది.

అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన అతనిని ఆకర్షించింది. సినిమాలకు, నాటికలకు ఖ్యాతి కెక్కిన మెక్సికోలో అవకాశాలు బోలెడు. నువ్వు ఒక పెద్ద స్టార్‌గా మారొచ్చు అంటూ ప్రకటన ఇచ్చిన వారు నమ్మబలికారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు అతను వారి వద్దకు వెళ్లాడు. ఆ క్షణం తాను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని సమూలంగా మార్పివేస్తుందని పాపం ఆ యువకుడికి తెలియదు? తీరా వెళ్లాకా అతన్ని నిలువునా వంచించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.

ఒకసారి కాదు రెండు సార్లు కాదు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అతని శరీరం పరుల పరమై పోయింది. అతని అందమైన కల కరిగిపోతుండగా బయటకు చెప్పుకోలేక కుమిలిపోయాడు. చివరికి అతను వారికి బంధీగా మారక తప్పలేదు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అతనిది. పురష సాంగత్యం కోరుకునే విటులను తీసుకొచ్చారు. కొత్తగా వచ్చిన సరకును చూపించారు. ఆ తరువాత ఎవరితో ఎంత సేపు గడపాలో నిర్ణయించారు. అంతేకాదు డోర్ డెలివిరీ సౌకర్యం కూడా ఉంది. విటులు కోరుకున్న చోటుకు వెళ్లి వారు ఆడుకునేందుకు అతను శరీరాన్ని అప్పగించాలి.

అతని ఆత్మ స్థైర్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. తిరగ బడాలన్న ఊహనే రాకుండా చేశారు. కనీసం బతకాలన్న ఆశ కూడా అతనిలో చచ్చిపోయింది. పారిపోవాలని ప్రయత్నిస్తావేమో నీ తరం కాదు. ఎప్పుడూ మా వాళ్లు ఇద్దరు నిన్ను గమనిస్తూనే ఉంటారు. సరైన పత్రాలు లేకుండానే మెక్సికో వచ్చావు. బయటకు వెళ్తే నీకు ఎలాంటి గతి పడుతుందో తెలుసా? ఇదీ వారి బెదిరింపు. ఆ యువకుడు దాదాపు ఏదాడిన్నర పాటు ఒక లైంగిక బానిసగా గడిపాడు. చివరకు ఆ నరక కూపం నుంచి తప్పించుకో గలిగాడు. కానీ సరైన అనుమతి పత్రాలు లేనందుకు అతడిని మెక్సికో ప్రభుత్వం నిర్బంధించింది.

అక్కడే ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు యువకుడిని కలుసుకున్నారు. అప్పటికే ఆ యువకుడు మానసికంగా పూర్తిగా కుంగిపోయి ఉన్నాడు. తన బతుకును నాశనం చేసిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. మానసిక వైద్యులు ఎంతో ప్రయత్నించిన తరువాత కానీ అతను మాములూ మనిషి కాలేదు. గత కాలం నాటి చేదు గుర్తులను తుడిచి వేసే ప్రయత్నంలో ఇప్పుడు ఆ యువకుడు ఉన్నాడు.

తన లాంటి యువకులు ఇలాంటి రాక్షసుల చేతుల్లో పడకుండా చూడాలని నిశ్చయించుకున్నాడు. రంగుల కలల వెనుక పరిగెడుతూ ఇతని మాదిరే వేటగాళ్ల ఉచ్చుల్లో చిక్కుకున్న వారు ఎందరో ఉన్నారట. అయితే జరిగిన దాన్నిమరచి తమ సొంత దేశాలకు తిరిగి పోవాలని అనుకునేవాళ్లే వారిలో ఎక్కువ.