• సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా: వీసీ

విశాఖపట్నం, అక్టోబర్ 15 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షల్లో తొలిసారిగా బార్‌కోడింగ్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తెలిపారు. ఈ నెల 17 నుంచి డిగ్రీ సెమిష్టర్‌ ప్రారంభం కానున్న నేపధ్యంలో విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థులు వత్తిడిని దరిచేరనివ్వకుండా, ప్రశాంత చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలన్నారు. వర్సిటీ విద్యార్థులు పరీక్షల్లో తమ పూర్తిసామర్ధ్యాలను ప్రస్పుటం చేస్తూ, మెరుగైన ఫలితాలను సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. వర్సిటీలో తొలిసారిగా విద్యార్థులకు అందించే జవాబు పత్రం బుక్‌లెట్‌పై ప్రత్యేక బార్‌కోడ్‌ను ముద్రించడం జరుగుతుందన్నారు. విద్యార్థి పేరు బుక్‌లెట్‌పై ముద్రించడం, బుక్‌లెట్‌లో ప్రతీ పేపరుపైన బార్‌కోడ్‌ను ముద్రించడం జరిగిందన్నారు.

వర్సిటీలో పరీక్షల మూల్యాకనం ప్రక్రియ మరింత వేగవంతం చేయడానికి, సత్వరం ఫలితాలను అందించడానికి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన ప్రశ్నాపత్రాల రూపకల్పన, ముద్రణ, పరీక్ష కేంద్రాలకు పంపే ప్రక్రియను పూర్తిచేసామన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. పరీక్ష ప్రశ్నాపత్రంలో ఎటువంటి తప్పులు దొర్లినా, సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చినా విద్యార్థులు తమ కళాశాల ప్రిన్సిపాల్‌ సహకారంతో వెంటనే వర్సిటీ ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.

పరీక్షల నిర్వహణలో వర్సిటీ నియమావళిని ఉల్లంఘించి ఎటువంటి మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహించినా, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి చర్యలకు పాల్పడినా బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతందని స్పష్టం చేశారు. అదే విధంగా నిబంధనలు అతిక్రమించిన కళాశాల గుర్తింపు (అఫిలియేషన్‌ను) సైతం 10 సంవత్సరాల కాలం రద్దుచేస్తామన్నారు.

పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పటిష్టంగా నిర్వహించడానికి కళాశాలలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. అదే విధంగా సమస్యాత్మక కేంద్రాలను ఇప్పటికే గుర్తించామని, వీటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.