• గొంతుకోసి కిరాతకంగా హతమార్చిన దుండగులు

లక్నో, అక్టోబర్ 18 (న్యూస్‌టైమ్): ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో రాజకీయ హింస చెలరేగింది. హిందూ సమాజ్ పార్టీ (హెచ్‌ఎస్‌పీ) నాయకుడు కమలేష్ తివారీని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా గొంతుకోసం హతమార్చారు. పదునైన మారణాయులతో దాడికి పాల్పడిన అగంతకులు క్షణంలో అక్కడి నుంచి తప్పించుకున్నారు.

మొహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కమలేష్ తివారీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తివారీ హిందూ మహాసభతో కలిసి ఉన్నారు.

ఘటనా స్థలం వద్ద పోలీసులు ఆధారాలు సేకరిస్తున్న దృశ్యం

పోలీసులు, ప్రత్యక్ష సాక్ష్యులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, పారిపోయే ముందు హంతకులు అతని గొంతు కోసి హత్యచేశారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించినప్పటికీ ఫలితం లేకపోయింది.

ఈ సంఘటన లక్నోలోని హిందూ సమాజ్ పార్టీ ఖుర్షీద్ బాగ్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. దాడి చేసిన వారు వ్యూహం ప్రకారం దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోకి ప్రవేశించిన వారు తివారీకి మొదట ‘టీ’ ఇచ్చారు. తివారీ కార్యాలయంలో టీ తాగిన తర్వాత వారు ఈ నేరానికి పాల్పడ్డారు.

తివారీపై పదునైన అంచుగల ఆయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నేరం జరిగిన ప్రదేశం నుండి దేశీయంగా తయారుచేసిన పిస్టల్, గుళికలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకవైపు, నేరానికి పాల్పడినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసి, మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

కమలేశ్ తివారీ హత్య జరిగిన అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలలో జరిగిన ఆందోళన కార్యక్రమాల సమాహారం

తివారీ తన హిందూ సమాజ్ పార్టీని ఏర్పాటుచేయకముందు హిందూ మహాసభలో కొనసాగారు. 2015లో మొహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసి అరెస్టుకు దారితీసిన ప్రకటనతో అతను వివాదాన్ని రేకెత్తించాడు. ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ)ను ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయోగించి కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. తివారీపై ఎన్‌ఎస్‌ఏ ఆరోపణలను అలహాబాద్ హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఇదిలావుండగా, తాజాగా ఘటనతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాజకీయ కోణంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అందుబాటులో ఉన్న పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. తివారీని హత్యచేసిన నిందితులను ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రం దాటి వెళ్లనీయవద్దన్నారు.