అమరావతి, అక్టోబర్ 18 (న్యూస్‌టైమ్): శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన తెదేపా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, మంతెన సత్యనారాయణరాజు, మంతెన శివరామరాజు శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ అక్రమాలపై ఏకరవుపెట్టారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం మాతలలో సామాజిక భవనానికి వైకాపాకు చెందిన రంగులు వేస్తుండటంతో వెంకటరమణతో పాటు పలువురు నిరసనకు దిగారు.

ఆ సమయంలో తెదేపా నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బూరాడ నాగరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్‌ఛార్జ్‌ సీఐ రవిప్రసాద్‌ నేతృత్వంలో మాతల గ్రామానికి వెళ్లిన పోలీసులు కలమట వెంకటరమణ, అతని కుమారుడు సాగర్‌ సహా 17 మంది తెదేపా కార్యకర్తలను అరెస్ట్‌ చేసి కొత్తూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ చర్యను టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.