• ‘రావాలి కాదు… వద్దొద్దు జగన్‌ అనేలా చేశారు’

విజయవాడ, అక్టోబర్ 20 (న్యూస్‌టైమ్): వైసీపీ సర్కారు పాలనా తీరుపై సామాన్యులు ధ్వజమెత్తుతున్నారు. ప్రధాన నిర్మాణ రంగ కార్మికులు ఇసుక కొరతపై మండిపడుతున్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న ఇసుక విధానం వినియోగదారులకు ఇసుకేస్తే రాలనంత కష్టంగా తయారైంది. ఏ ర్యాంపు చూసినా ఇసుకకోసం బారులు తీరిన వాహనాలు బిల్లులు చేత్తో పట్టుకుని తిరిగే వినియోగదారులతో నిండిపోయి ఇసుకేస్తే రాలనంతగా కనిపిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో ఉన్న యలమంచిలి లంక, అబ్బిరాజుపాలెం ర్యాంపుల్లో వినియోగదారుల కష్టాలు కొట్టొచ్చినట్లు కనపడ్డాయి. రెండు కిలోమీటర్ల మేర బారులుదీరిన ట్రాక్టర్ల దగ్గర నిలబడిన ఏ చోదకుడిని అడిగినా వివరించే కష్టం అంతా ఇంతా కాదు. రెండు రోజుల నుంచి ఇసుక కోసం ర్యాంపుల్లోనే వేచి ఉన్నవారు కొందరు కనిపించారంటే అతిశయోక్తి కాదు. ఎగుమతి చేసేవారు లేరని చెప్పి ఇసుక ఇవ్వకుండా వెనక్కు పంపించిన ఏపీఎండీసీ సిబ్బంది తర్వాత కొన్ని ట్రాక్టర్లకు లోడు చేయడం వివాదాస్పదమైంది.

ఆదివారం ఉదయం దీనిపై చోదకులు నిరసనలు వ్యక్తం చేస్తూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతసేపు వర్షం వస్తుందని చెప్పి ఇసుక ఎగుమతులు నిలిపేశారు. అబ్బిరాజుపాలెం ర్యాంపును చూస్తే జాతరను తలపించింది. ఇక్కడ ఘాట్‌ రహదారిలో ఒకపక్క నిలిపేసిన ట్రాక్టర్లు మరోపక్క వచ్చీపోయే వాహనాలతో రహదారి కిక్కిరిసిపోయింది. కనీసం కాలినడకన వెళ్లడం గగనంగా మారింది.

ఏపీఎండీసీ సిబ్బంది కౌంటర్‌ తెరవగానే కొత్త సినిమాకు టికెట్లు కొనుగోలుకు పోటీపడినట్లుగా వినియోగదారులు ఒకరిపై మరొకరు పడుతూ ఇసుక కోసం నానా కష్టాలు పడ్డారు. నదిలో పడవలపై ఒకదాని వెనుక మరొకటిగా ఇసుకను తీసుకురావడం.. దిగుమతులు ఎగుమతులతో ర్యాంపులు నిండుగా కనిపించాయి.