• పత్తికొండలో కిలో రూపాయే?

  • బ్లాక్ మార్కెట్‌కు చేరుతున్న స్టాక్

అమరావతి, కర్నూలు, అక్టోబర్ 20 (న్యూస్‌టైమ్): బయట మార్కెట్లో టమోటా కొనాలంటే 30 కిలోల బుట్ట 350 రూపాయలకు పైనే ఉండగా కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్‌లో రైతుకు మాత్రం 30 రూపాయలే ఇస్తామంటున్నారు దళారులు. అయితే, ఈ దళారులను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ నేతకు చెందిన వారిగా ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవంలో మాత్రం టమోటా ధరలు ఆకాశానంటుతున్నాయి. 10 నుంచి 15 శాతం కమిషన్ ఇచ్చి మరీ వ్యాపారులు, దళారులు కుమ్మక్కయి రైతు పొట్టకొడుతుంటే అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.

నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్‌లో లావాదేవీలు జరగాల్సి ఉండగా పత్తికొండలోని ఒక ప్రైవేటు స్థలంలో నిర్వహిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. దాదాపు 10 రోజుల నుంచి టమోటా రైతులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్న ఆరోపణ లేకపోలేదు.

మార్కెట్‌లో విక్రయాలు ప్రైవేట్ స్థలాల్లోకి మార్పించింది వైసీపీ నేతలేనని కర్నూలు జిల్లా తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు. కమిషన్లు దండుకునేది వైసీపీ నాయకులేనని, పైకి మాత్రం సీఎం జగన్ ఆరా, కట్టడి, నియంత్రణ పడికట్టు, కనికట్టు వార్తలు వైసీపీ తన సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవాచేస్తున్నారు. ఈ విమర్శలు ఎలా ఉన్నా, మరోవైపు, ధరను శాసిస్తున్న దళారులపై వేటు వేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

డీ రెగ్యులేషన్‌తో పత్తికొండ మార్కెట్‌ యార్డులో ఏజెంట్లు ఓవరాక్షన్‌‌ చేస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ, మార్కెటింగ్ మంత్రిత్వ శాఖల అధికారులను ఆదేశించింది. కాగా, ధరల స్థిరీకరణ నిధి ద్వారా నేరుగా మార్కెటింగ్‌ శాఖ కొనుగోళ్లు జరిపేలా మార్గదర్శకాలు ఇచ్చింది. రైతులకు కిలోకు రూ.4 వరకు అదనంగా చెల్లింపు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో దెబ్బకు దిగొచ్చి కొనుగోళ్లు మొదలుపెట్టారు దళారులు.

ఇంకోవైపు, ఇబ్బందులు సృష్టించిన ఏజెంట్లపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడవద్దని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించడం అభినందనీయం. ఒక్కమాటలో చెప్పాంటే, రాష్ట్రంలో టమాటా మార్కెట్‌కు పత్తికొండ ప్రాంతం పెట్టింది పేరు. కొద్ది రోజులుగా అక్కడి రైతులకు లభిస్తున్న ధర కూడా బాగానే ఉంది. రోజూ లాగే పెద్ద ఎత్తున రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. పంట ఎక్కువగా రావడం చూసిన దళారులకు లాభాలు ఆర్జించడంపై కన్నేశారు. ఈ నేపథ్యంలో వారి కనుసైగలతో నిమిషాల వ్యవధిలో ధర భారీగా పడిపోయింది. ధరల స్థిరీకరణ నిధి ఉపయోగించి సరుకు కొనుగోలు చేయాలంటూ మార్కెటింగ్‌ శాఖ అధికారులకు ఆదేశాలు రావడంతో వెంటనే వారు రంగంలోకి దిగి కిలోకు రూ.4 అధికంగా ఇచ్చి కొనుగోళ్లు మొదలు పెట్టారు. దీంతో దళారుల దిమ్మ తిరిగిపోయింది.

ఇలాగైతే తమకు సరుకు దక్కదని వారూ ఆదే రేటుకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దళారులను అరికడతామని, ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీని సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లాలో అక్షరాలా అమలు చేసి చూపారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మార్కెట్‌ ఫీజు లేకుండా, ఏజెంట్లకు కమిషన్‌ ఇవ్వకుండా రైతులకు వంద శాతం న్యాయం జరిగేలా పండ్లు, కూరగాయల అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలై నుంచి డీ రెగ్యులేట్‌ చేసింది. దీంతో తమకు లాభంలేదని భావించిన కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌ యార్డులోని దళారులు సమస్యలు సృష్టించారు.

మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు చేస్తే తమకు ఉపయోగం ఉండడం లేదని, లోపల అమ్మకాలు నిలిపివేసి రైతులే బయటకు వచ్చి సరుకు విక్రయించాలని, లేకపోతే కొనుగోళ్లు చేయబోమని బెదిరింపులకు దిగారు. కానీ, రైతులు తాము లోపలే విక్రయాలు చేస్తామని చెప్పడంతో ఇబ్బంది ఏర్పడింది. ఈ సమస్య సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి వెళ్లడంతో వెంటనే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిపించాలని మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ధరల పతనం కాకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది ఉండకూడదని, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు.

వెంటనే మార్కెటింగ్‌ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మార్కెటింగ్‌ శాఖ వెనువెంటనే టమోటా కొనుగోళ్లను ప్రారంభించింది. కిలోకు అదనంగా రూ.4 ఇచ్చి కొనుగోళ్లు మొదలెట్టింది. ఇలా 50 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. నేరుగా తాము కొనుగోళ్లు జరపడం వల్ల రూ.14, రూ.15 ఉన్న కిలో టమాటా ధర రూ.18, రూ.19కి పెరిగి రైతులకు లాభం చేకూరింది. దీంతో అవాక్కయిన దళారులు తాము నష్టపోతామని భావించి వెంటనే మార్కెట్‌లోనే కొనుగోళ్లు చేయడం మొదలు పెట్టారు. దీంతో వారు కూడా 100 మెట్రిక్‌ టన్నుల టమాటాను కోనుగోలు చేశారు.

నాలుగు నెలల్లోనే గిట్టుబాటు ధర విషయమై సీఎం మాట నిలుపుకున్నారని రైతులు ప్రశంసించారు. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధి వల్ల వెంటనే కొనుగోళ్లు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయగలిగామని మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న తెలిపారు.

రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారన్నారు. ఈ ఏడాది జూలై నుంచి మార్కెట్‌ డి రెగ్యులేషన్‌ను ప్రారంభించామని, దీనివల్ల రైతులకు పూర్తిగా న్యాయం జరుగుతుందని కమిషనర్‌ చెప్పారు.