కడప, అక్టోబర్ 20 (న్యూస్‌టైమ్): విపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీ లక్ష్యంగా వివేకానందరెడ్డి హత్య కేసుపై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉంది. ‘‘ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటు అన్నారు. చనిపోతూ లేఖలు రాసారని చెప్పి గందరగోళం సృష్టించారు. తీరా హత్య అనేది బయటపడ్డాక ప్లేట్ ఫిరాయించి చంద్రబాబే ఈ హత్య చేయించారని ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ సాక్షి అసత్య కధనాలు రాయించింది.

అందులో పోలీసు బాసుల ప్రమేయమూ ఉందని తేల్చేసింది. ఒక పత్రిక ఇలా రాయొచ్చా? ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి చూపొచ్చా? ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలని ఈరోజు కోర్టులో అభ్యర్థించిన జగన్‌కు అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అని తెలియదా? అయినప్పటికీ మీడియా స్వేచ్ఛను హరిస్తూ సాక్షిపై ఎటువంటి చర్యలకూ ఆదేశించలేదు చంద్రబాబు. అది ధైర్యవంతుల లక్షణం. ప్రజాస్వామ్యంపై ఆయనకున్న గౌరవం. జగన్‌కు ఈ లక్షణాలు లేవు.

అందుకే అక్రమాలను ఎత్తి చూపిన మీడియాపై అసహనానికి గురవుతున్నారు. ఈరోజు కేసును ప్రభావితం చేస్తున్నారని వర్ల రామయ్యను వేధిస్తున్న పోలీసులు ఆరోజు ఇలాంటి రాతలు రాసిన సాక్షిని, రాయించిన దాని అధిపతిని ఏం చేస్తారు? పోలీసు బాసులకు కూడా హత్యతో ప్రమేయం ఉందన్న పత్రికపై పోలీసులు మీసం మెలేసి, తొడగొట్టి సవాలు చేయగలరా’’ అంటూ టీడీపీ తన తాజా సోషల్ మీడియా పోస్టులో ఘాటుగా ప్రశ్నించింది.

ఒకపక్క ఈ కేసు విషయంలో ఇష్టారాజ్యంగా కథనాలు ప్రచారం చేయవద్దని, ఆధారాలు లేకుండా ఎలాంటి వార్తలు రాయవద్దని, సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం ఈ విమర్శలకు అడ్డుకట్టపడ్డంలేదు. మరోవైపు, వివేకా హత్య కేసుపై సందేహాలు వ్యక్తంచేసినందకు గాను టీడీపీకి చెందిన దళిత నాయకుడు వర్ల రామయ్యపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడి తొడకొట్టి మరీ సవాలు చేసిన సంగతి తెలిసిందే.

ఇంత జరుగుతున్నా సీఎం జగన్ గాని, ఆయన, ఆయన చిన్నాయన కుటుంబం గానీ ఈ కేసు వ్యవహారంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.