• ఆపరేటర్ అవమానించారని అఘాయిత్యం

ఒంగోలు, అక్టోబర్ 20 (న్యూస్‌టైమ్): గ్రామ వాలంటీర్లకు ఏమైంది? తాత్కాలికమో, శాశ్వతమో ఏదైనప్పటికీ దొరికిన ఉద్యోగాన్ని ఎంజాయ్ చేయకుండా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తోటి ఉద్యోగి చిన్నబుచ్చాడనొ, పై అధికారి ఆగ్రహించాడనో, రాజకీయ నాయకులు విమర్శలు చేశారనో చివరికి తమ ప్రాణాలు తీసుకుంటున్న వాలంటీర్ల సరసన మరొకరు చేరడం దారుణం. కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడని ఒక గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చోటుచేసుకుంది.

గత నెలలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం జీలుగుమిల్లి మండలంలో గ్రామ వాలంటీర్ పండు నవీన (22) ఆత్మహత్య చేసుకున్న సంగతి మరువక ముందే మరో ఆత్మహత్య చోటు చేసుకుంది. కంప్యూటర్ ఆపరేటర్ పరుషంగా మాట్లాడని గ్రామ వాలంటీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. యర్రగొండుపాలెం తహశీల్దార్ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ మాటలకు తీవ్ర మనస్తాపం చెందిన యర్రగొండపాలెం పట్టణానికి చెందిన గ్రామ వాలంటీర్ షేక్ జుబేద (20) బలవన్మరణానికి పాల్పడింది.

ఈ ఘటనపై మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కంప్యూటర్‌ ఆపరేటర్‌ గుంటూరి శివప్రసాద్‌చారి జుబెడాను అవమానకరంగా మాట్లాడాడు. రెండు రోజుల క్రితం రాత్రి పూట తమ ఇంటికి వచ్చిన శివప్రసాద్‌చారి రికార్డులన్నీ పూర్తి చేసి శనివారం ఉదయానికి ఎమ్మర్వో కార్యాలయానికి తీసుకురావాలని హెచ్చరించారని వాపోయింది. అంతేకాదు, సక్రమంగా పనిచేయడం లేదని, ఇలా అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారని కటువుగా మాట్లాడారని ఆరోపించింది.

దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జుబేద ఉదయం బాత్‌రూమ్ పైనున్న ఇనుపరాడ్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని కరీమున్‌ చెప్పారు. ప్రస్తుతం శివప్రసాద్‌చారి పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.