అమరావతి, అక్టోబర్ 22 (న్యూస్‌టైమ్): అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.263.99 కోట్లు విడుదల చేయడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న మాటను మారోమారు నిలబెట్టుకున్నారని, సంస్థలో రూ.10 వేల లోపు డిపాజిట్‌ చేసిన దాదాపు 3.70 లక్షల మందికి వెంటనే పైకం చెల్లించేందుకు ఏర్పాట్లు చేయడం అభినందనీయమన్నారు.

మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ డీఎల్‌ఎస్‌ ద్వారా వారి వారి ఖాతాలలో ఆ మొత్తం జమ అవుతుందని, అగ్రిగోల్డ్‌ బాధితులెవ్వరూ అధైర్య పడవద్దని, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు. ఆ దిశలో సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు కూడా ఆ మొత్తం చెల్లిస్తారని చెప్పారు.

అగ్రి గోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం జగన్, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నారని, అందుకు ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు.

మరోవైపు, అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు రూ.1150 కోట్లు కేటాయించి, రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారందరికీ చెల్లిస్తామని ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అగ్రి గోల్డ్‌ సంస్థలో పెట్టుబడి పెట్టి మోసపోయిన తమను ఆదుకోవాలని నాడు బాధితులు ఎంత మొర పెట్టుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదని, ఆ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కై చౌకలో ఆస్తులు కొట్టేయాలని చూశారని కృపారాణి ఆరోపించారు.

అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన వారికి కూడా తప్పనిసరిగా న్యాయం చేస్తారని, వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తంచేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం తరపున చెల్లింపులు జరిపి ఆదుకుంటామంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తంచేశారు.

ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో పనిచేస్తూ అవినీతి రహిత పాలన అందిస్తున్న వైఎస్ జగన్‌ను విమర్శించడం మానుకుని ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీ దృష్టిపెడితే బావుంటుందని హితవుపలికారు.