హైదరాబాద్, అక్టోబర్ 22 (న్యూస్‌టైమ్): ఇరవై ఐదేళ్ల చరిత్రలో ప్రస్తుత నాయకులూ చరిత్రను తిరగ రాసారని, ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నికోవడంపై సినీ కార్మిక యూనియన్ నాయకులు అభినందనలు తెలిపారు. ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వర రావు (బందరు బేబీ) ఆధ్వర్యంలో ఇందిరానగర్ యూనియన్ కార్యాలయంలో  తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు.

యూనియన్ అధ్యక్షులుగా స్వామి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా అనిల్  కుమార్ వల్లభనేని, కోశాధికారిగా పి. రవి, సహాయ కార్యదర్శిగా రాజశేఖర్ ప్రమాణ స్వీకారం చేసారు. గత ఆదివారం యూసఫ్ గూడా మహమూద్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన జూనియర్ ఆర్టిస్ట్స్ సర్వసభ్య సమావేశంలో ఇన్స్యూరన్స్ చేసి సెర్టిఫికెట్లు అందజేసిన అనంతరం సభ్యులు నూతన కమిటీని ఏకగ్రీవంగా పథ కమిటీని ఎన్నుకున్నారు.

తెలుగు సినీ అండ్ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ చైర్మన్ వి.శ్రీశైలం యాదవ్, ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వరరావు (బందరు బేబీ) డైరెక్టర్స్ యూనియన్ అధ్యక్షులు ఎన్.శంకర్, మనం సైతం కాదంబరి కిరణ్, మేనేజర్స్ యూనియన్ అధ్యక్షులు అమ్మిరాజు, చిత్రపురి హోసింగ్ సొసైటీ కార్యదర్శి వినోద్ బాల, ఫిలిం ఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్సులు రాజేశ్వర రెడ్డి, చిల్లర వేణు, ఫైట్ మాస్టర్స్ యూనియన్ అధ్యక్షులు బాజీ, కోశాధికారి రమేష్ రాజు, టెక్నీషియన్ యూనియన్ కోశాధికారి సురేష్, డాన్స్ మాస్టర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీధర్, ప్రొడక్షన్ యూనియన్ అధ్యక్షులు సుబ్బరాజు, మహిళా వర్కర్స్ యూనియన్ ప్రతినిధి శ్యామల తదితరులు మాట్లాడుతూ గత 25 ఏళ్ల తెలుగు సినీ యూనియన్ చరిత్రలో అభివృద్ధికి బాట వేసిన జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ పాత నాయకులనే సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికోవడం ఆరోగ్యకరమైన వాతావరణమని, ప్రతి యూనియన్‌లో ఇలాంటి వాతావరణం చోటు చేసుకోవాలని పేర్కొన్నారు.

గతంలో జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అంటే 24 క్రాఫ్ట్స్‌లో గుర్తింపు ఉండేది కాదని, సభ్యులు బాధలు, సమస్యలతో సతమతం అయ్యేవారని కానీ నేడు ఫిలిం ఫెడరేషన్ వద్ద, ఛాంబర్ వద్ద ప్రముఖంగా చర్చించుకునే స్థాయికి గత రెండేళ్లలో రావడం అభినందనీయమన్నారు. యూనియన్ సభ్యుల అభివృద్ధికి నూతన కమిటీ కట్టుబడి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

యూనియన్‌కి సొంత భవనం ఏర్పాటు దిశలో ఉండటం అభిమానందనీయమని పేర్కొంటూ నూతన కమిటీకి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వల్లభనేని యువసేన ప్రతినిధులు స్టీఫన్ రెడ్డి, సునయన తదితరులు తమ అభిప్రాయాలూ తెలియజేసారు.