హైదరాబాద్, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది.

రానున్న 24 గంటల్లో వాయువ్యం దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా బుధ, గురువారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాలలో ముందస్తు సహాయక చర్యలను ప్రారంభించారు. మరోవైపు, కర్ణాటక కోస్తా ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఉంటుందని, గురు, శుక్రవారాలలో అక్కడ కూడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. ఇక వచ్చే నాలుగు రోజులపాటు ద్వీపకల్ప భారతంలో కూడా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తూర్పు, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలలో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య భారతంలో వచే​ మూడు రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీయ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని ఆర్టీజీఎస్‌ హెచ్చరించింది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. మిగిలిన జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం కూడా కొనసాగుతోంది. 4.5 కిలోమీటర్లు ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతోంది.

తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు ఉత్తర ఇంటిరియర్‌ కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాగల 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రా తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతోందని అధికారులు పేర్కొన్నారు.

కోస్తా ఆంధ్రా, యానం, తదితర ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసేఅవకాశం వుందని వాతావరణ శాఖ చెబుతోంది. కాగా నేడు, రేపు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.