ముంబయి, అక్టోబర్ 23 (న్యూస్‌టైమ్): రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అనుబంధ టెలికం సంస్థ జియో రావడంతోనే సంచలనం. సరిగ్గా మూడేళ్ల కిందట పూర్తి స్థాయి వాణిజ్య సేవలను ప్రారంభించిన ఈ కంపెనీ భారత్‌లో డిజిటల్‌ విప్లవాన్ని సృష్టించిందనే చెప్పవచ్చు.

భాగస్వాములు, ఉద్యోగుల కోసం బీటాతో జియో సాఫ్ట్ 27 డిసెంబర్ 2015న ప్రారంభించినప్పటికీ 5 సెప్టెంబర్ 2016న బహిరంగంగా వాణిజ్య మార్కెట్‌లోకి జియో సేవలు అందుబాటులోకి వచ్చాయి. కంపెనీ అధికారిక లెక్కల ప్రకారం ఈ ఏడాది మే నెలాఖరు నాటికి జియో భారతదేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గాను, ప్రపంచంలో మూడవ అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్‌గా 322.99 మిలియన్లకు పైగా చందాదారులను సొంతం చేసుకుంది.

డేటా విషయంలో జియోకు ముందు, జియోకు తర్వాత అని చెప్పుకునేంతగా మార్పు తీసుకువచ్చింది. భారతీయులు డేటాను ఎక్కువగా వినియోగించుకోరు అన్న భ్రమలను పటాపంచలు చేస్తూ అమెరికాను నెట్టి మరీ డేటా వినియోగంలో భారత్‌ను అగ్రస్థానాన్ని ఆక్రమించుకునేలా చేసింది. గత పాతికేళ్లలో పాత ఆపరేటర్లందరూ కలిసి స్థాపించుకున్న 2జీ నెట్‌వర్క్‌కు మించి 4జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుందీ సంస్థ. అందుకు ఈ కంపెనీ తీసుకున్న సమయం మూడేళ్లు మాత్రమే.

రిలయన్స్‌ జియో గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే భారత్‌లో ఉచిత కాల్స్‌కు వాస్తవ రూపం ఇచ్చిన తొలి సంస్థ ఇదేనని చెప్పాలి. మార్కెట్‌ను మొత్తం డేటా దిశగా నడిపించిందీ జియో. అంతక్రితం నెలకు 20 కోట్ల జీబీ మాత్రమే భారతీయులు వినియోగించే వారు జియో రాకతో అది ఏకంగా 125 కోట్ల జీబీకి చేరింది.

మొబైల్‌ డేటా వినియోగంలో జియోకు ముందు భారత్‌ 155వ స్థానంలో ఉండగా ఇపుడు నంబర్‌ 1 స్థానంలో ఉంది. టీవీని చూసే సమయంతో పోలిస్తే అంతకు ఏడు రెట్లు మొబైల్‌పై భారతీయులు గడుపుతున్నారంటే అదంతా జియో చలవే. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా కేవలం 170 రోజుల్లో 10 కోట్ల వినియోగదార్లను సొంతం చేసుకోలేదు.

అది జియోకు మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం 32.299 కోట్ల మందికి జియో తన సేవలందిస్తోంది. డేటా టారిఫ్‌లోనూ జియో విప్లవం సృష్టించదనే చెప్పాలి. అంతక్రితం జీబీకి రూ.250 నుంచి రూ.4000 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

ఇపుడు ఒక జీబీ రూ.50 కంటే తక్కువకే లభిస్తోంది. జియో వినియోగదార్లకియతే 84 రోజులకు రోజూ 1 జీబీ చొప్పున రూ.399కే వస్తోంది. అంటే రూ.50/జీబీ కంటే చాలా తక్కువన్నమాట. వైర్‌లెస్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ సంఖ్య విషయంలోనూ జియో విప్లవం కొనసాగింది.

ఇదిలావుండగా, టెలికాం రంగంలో విప్లవం తీసుకొచ్చిన రిలయన్స్ జియో ముందుగా అన్నీ ఉచితం అని చెప్పి కొన్నేళ్లకు కస్టమర్లపై గుదిబండ వేసింది. ఇకపై నాన్‌ జియో నెంబెర్లకు ఫోన్ చేస్తే నిమిషానికి ఆరుపైసలు వసూలు చేస్తోంది. అక్టోబర్ 10 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. అయితే చాలామందిలో జియోకు సంబంధించి రీచార్జ్‌ ప్లాన్లు పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. జియోను రీచార్జ్ చేసుకునేందుకు రెండు రకాల ప్లాన్లను జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకటి బేసిక్ ప్లాన్ కాగా రెండోది ఇంటర్‌ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు (ఐయూసీ)పేరుతో టాప్‌అప్‌లు.

రెండు రీచార్జ్‌ ప్లాన్లలో ఒకటి బేసిక్ ప్లాన్ ముందు ఎలాగుండేదో అలానే ఉంటుండగా మరొకటి నాన్ జియో నెంబర్లకు అంటే వోడాఫోన్, ఎయిర్‌టెల్‌లాంటి నెట్‌వర్క్‌లకు జియో నెంబరు నుంచి ఫోను చేస్తే నిమిషానికి ఆరుపైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసమే మరో రీఛార్జ్‌ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఐయూసీ టాప్‌ అప్ ప్లాన్ అని పిలుస్తారు. అక్టోబర్ 9వ తేదీవరకు రీఛార్జ్ చేసుకున్న జియో కస్టమర్లు తమ ప్లాన్‌ ముగిసేవరకు అలానే ఉంటుందని అక్టోబర్ 10వ తేదీ నుంచి రీచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం ఇతర నెట్‌వర్క్‌లకు ఫోన్ చేయాలంటే మరో టాప్‌అప్ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఇంటర్ యూసేజ్ కనెక్ట్‌కు సంబంధించి టాప్‌అప్‌లు రూ.10 నుంచి రూ. 1000 వరకు ఉంటాయని జియో పేర్కొంది. జియో రీచార్జ్‌ ప్లాన్‌లు చాలా ఉన్నాయి. రూ.98తో ప్రారంభమైతే 149, 198, 299, 349, 397, 399, 448, 449, 498, 509, 799 ఉండగా దీర్ఘకాలిక ప్లాన్లు రూ.9,999 వరకు ఉన్నాయి. ఈ మెయిన్ ప్లాన్లను సెలెక్ట్ చేసుకుంటే ఐయూసీ టాప్‌అప్ ప్లాన్లు వీటితోనే వస్తున్నాయి. అంటే రూ. 10 నుంచి రూ.1000వరకు ఐయూసీ ప్లాన్లు వస్తున్నాయి. ఉదాహరణకు రూ.399తో రీచార్జ్ చేసుకుంటే ఐయూసీ టాప్‌అప్ రూ.10 వస్తుంది. ఇది 124 నిమిషాల ఐయూసీ టాక్‌టైమ్‌తో పాటుగా 1జీబీ అదనపు డేటా కూడా వస్తుంది. ప్రతి రూ.10 ఐయూసీ టాప్‌అప్‌తో అదనంగా 1 జీబీ డేటా పొందుతారు.

ఒకవేళ ఇతర ఆపరేటర్లకు వాయిస్ కాల్స్ చేయరని భావిస్తే అందుకు ఐయూసీ ప్లాన్ తీసుకోనవసరం లేదు. ప్లాన్లలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. కస్టమర్ బేసిక్ ప్లాన్‌ మాత్రమే రీచార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. అయితే ఇతర ఆపరేటర్లకు మాత్రం ఔట్‌గోయింగ్ కాల్స్ చేసుకునే వీలుండదు. ఇదిలా ఉంటే బేసిక్ ప్లాన్‌లతో ఒక పరిమితి వరకే ఇతర ఆపరేటర్లకు ఫోన్‌ చేసుకునే అవకాశం ఉంటుందని ఆ తర్వాత తప్పనిసరిగా ఐయూసీ రీచార్జ్‌ చేయించుకోవాల్సిందేనని జియో సంస్థ స్పష్టం చేసింది. అయితే వాయిస్ కాలింగ్ యాప్‌ అంటే వాట్సాప్‌ ద్వారా ఇతర నెట్‌వర్క్‌లకు ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. ఇతర ఆపరేటర్లకు మెసేజ్ పంపాలంటే ఐయూసీ ఉండక్కర్లేదని వివరించింది.

మరోవైపు, రిలయన్స్ జియో కొత్త మంత్లీ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీల వడ్డనపై నిరసనలు వెల్లువెత్తడంతో జియో కొత్త ఎత్తుగడతో వచ్చినట్టు కనిపిస్తోంది. ఉచిత ఐయూసీ కాల్స్‌ ఆఫర్‌తో ‘జియో ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాన్స్‌ (మూడు రీచార్జ్‌ ప్లాన్ల)ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు 2 జీబీడేటాను అందిస్తోంది. ప్రధానంగా ఈ ప్లాన్లలో విశేషం ఏమిటంటే జియోయేతర మొబైల్‌ నంబర్లకు 1,000 నిమిషాల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్‌ చేస్తోంది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం లభిస్తుంది.

ఈ కొత్త ప్లాన్స్‌ ఒక నెలకు రూ. 222, 2 నెలలకు రూ. 333, 3 నెలలకు రూ. 444లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు. తమ కొత్త ప్లాన్స్‌ ఇతర ప్రత్యర్థి కంపెనీల కంటే మార్కెట్లో కనీసం 20-50 వరకు వరకు చౌకగా ఉన్నాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను రూ. 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది. 3 నెలల 2జీబీ ప్యాక్(రూ. 448)తో పోలిస్తే రూ. 444 మాత్రమే ఖర్చు అవుతుంది. రూ. 396 (198×2) ప్లాన్స్‌లో మునుపటి ఖర్చుతో పోలిస్తే ఇపుడు రూ. 333 మాత్రమే ఖర్చవుతుందని, అలాగే అదనంగా 1,000 నిమిషాల ఐయూసీ వాయిస్ కాల్స్‌ ఉచితమని జియో తెలిపింది. విడిగా దీన్ని కొనాలంటే 80 రూపాయలు వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తుందని జియో వెల్లడించింది.

కాగా ఇంటర్‌కనెక్ట్ యూజర్‌ ఛార్జీ పేరుతో నిమిషానికి రూ. 6 పైసల వసూలును ఇటీవల జియో ప్రకటించింది. అలాగే ఒక రోజు వాలిడిటీ ఉన్న రూ.19 ప్లాన్‌ను, 7రోజుల వాలిడిటీ రూ. 52ప్లాన్‌ను తొలగించింది. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కాగా, అటు ప్రత్యర్థి కంపెనీ వొడాఫోన్‌ స్పందిస్తూ తాము ఎలాంటి ఐయూసీ చార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.