ఆఫ్ఘనిస్తాన్‌, అక్టోబర్ 24 (న్యూస్‌టైమ్): ఆఫ్ఘనిస్తాన్‌ ఆసియా ఖండంలోని అతి పేద, వెనుకబడిన దేశాలలో ఒకటి. దీనికి సముద్ర తీరం లేదు. ఈ దేశం ఆధికారిక నామం ‘ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్‌’. భౌగోళికంగా ఈ దేశాన్ని వివిధ సందర్భాలలో మధ్య ఆసియా దేశంగాను, మధ్యప్రాచ్య దేశంగాను, లేదా దక్షిణ ఆసియా దేశంగాను వ్యవహరించడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌కు దాని సరిహద్దు దేశాలతో జాతి, భాషా, భౌగోళిక సంబంధాలున్నాయి. దక్షిణాన, తూర్పు న పాకిస్తాన్‌, పశ్చిమంలో ఇరాన్‌, ఉత్తర దిశన తుర్కమేనిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, తజికిస్తాన్‌, దూర ఈశాన్యంలో చైనా ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి.

దక్షిణ ఆసియా, మధ్య ఆసియా, నైరుతీ ఆసియా లను కలిపే ఆఫ్ఘనిస్తాన్‌ చారిత్రకంగా సిల్క్‌ వాణిజ్య మార్గంలో ఒక ముఖ్యమైన స్థానం. వివిధ సంస్కృతుల మేళనానికీ, జాతుల వలసకూ ముఖ్యమైన మజిలీగా ఉంది. పరిసర రాజ్యాల దండయాత్రలకు ఊ దేశం తరచు గురయ్యేది. అలాగే ఇక్కడి రాజులు కూడా పరాయి రాజ్యాలను ఆక్రమించి సామ్రాజ్యాలు స్థాపించారు. 18వ శతాబ్దం మధ్యకాలంలో కాందహార్‌ కేంద్రంగా అహమ్మద్‌ షా దుర్రానీ విశాలమైన రాజ్యాన్ని స్థాపించాడు.

కానీ, 19వ శతాబ్దంలో ఇది బ్రిటిష్‌ సామ్రాజ్యంలో భాగమయింది. 1919 ఆగస్టు 19న మళ్ళీ స్వతంత్ర దేశం అయింది. 1970 దశకం నుండి ఆఫ్ఘనిస్తాన్‌ తీవ్రమైన అంతర్యుద్ధాలతోనూ, తీవ్రవాద కార్యకలాపాలతోనూ, విదేశీ దాడులతోనూ దారుణంగా నష్టపోయింది. దేశప్రజలు దారుణమైన ఇబ్బందులకు గురయ్యారు. 2001 తరువాత నాటో జోక్యంతో జరిగిన యుద్ధం తరువాత ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం అమెరికా సహకారంతో నడుస్తున్నది. అంతర్జాతీయ సహకారంతో పెద్దపెట్టున పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌ అంటే ‘ఆఫ్ఘనుల ప్రదేశం’.

ఇక్కడి పర్షియన్లు తమను ‘ఆఫ్ఘనులు’ అని (కనీసం ఇస్లామిక్‌ యుగకాలం నుండి) చెప్పుకొన్నారు. ప్రత్యేకించి పుష్తో భాష మాట్లాడేవారికి ‘ఆఫ్ఘన్‌’ పదాన్ని వర్తింపజేయడం జరుగుతున్నది. భారతీయ జ్యోతిశ్శాస్త్రవేత్త వరాహమిహిరుడు క్రీ.శ. 6వ శతాబ్దంలో ఈ ప్రాంతంవారిని అవగాన అని తన బృహత్‌ సంహితలో ప్రస్తావించాడు. 16వ శతాబ్దంలో మొఘల్‌ రాజు బాబర్‌ తన బాబర్‌నామాలో కాబూల్‌ దక్షిణ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్‌ అని రాశాడు.

19వ శతాబ్దం వరకూ ‘పుస్తూన్‌’ జాతివారికే ఆఫ్ఘనులు అనే పదాన్నివాడారు. మొత్తం రాజ్యాన్ని సూచించడానికి కాబూల్‌ రాజ్యం అనే పదాన్ని బ్రిటిష్‌ చరిత్ర కారుడు ఎల్ఫిన్‌స్టోన్‌ వాడాడు. క్రమంగా దేశం ఏకమై అధికారం కేంద్రీకృతమయన తరువాత ఆఫ్ఘన్‌ భూమి అన్న పదాన్ని వివిధ ఒడంబడికలలో వాడారు. 1857లో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ మొత్తం దేశాన్ని ‘ఆఫ్ఘనిస్తాన్‌’ అనే పేరుతో ప్రస్తావించాడు. 1919లో దేశానికి పూర్తి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆధికారికంగా ‘ఆఫ్ఘనిస్తాన్‌’ అనే పదాన్ని ప్రామాణికం చేశారు. అదే పదాన్ని 1923 రాజ్యాంగంలో నిర్ధారించారు.

ఆఫ్ఘనిస్తాన్‌ పూర్తిగా ఇతర దేశాలతో చుట్టబడిన (సముద్ర తీరం లేని) దేశం. ఎక్కువ భాగం పర్వత మయం. ఉత్తరాన, నైరుతి దిశన మైదాన ప్రాంతం. దేశంలో అత్యంత ఎత్తైన స్థలం నౌషాక్‌ (సముద్ర మట్టం నుండి 7,485 మీటర్లు లేదా 24,557 అడుగులు ఎత్తు). దేశంలో వర్షపాతం బాగా తక్కువ. ఎక్కువ భాగం పొడి ప్రదేశం. ఎండోర్హిక్‌ సిస్టాన్‌ బేసిన్‌ ప్రపంచంలోనే అత్యంత పొడిగా ఉన్న ప్రాంతాలలో ఒకటి.

ఆఫ్ఘనిస్తాన్‌ వాతావరణం ఖండాతర్గతం. వేసవి కాలం చాలా వేడిగానూ, చలికాలం చాలా చల్లగానూ ఉంటుంది. చిన్న చిన్న భూకంపాలు, ముఖ్యంగా ఈశాన్యాన హిందూకుష్‌ పర్వత ప్రాంతంలో, తరచు సంభవిస్తుంటాయి. 1998 మే 30న వచ్చిన భూకంపంలో సుమారు 125 గ్రామాలు నాశనమయ్యాయి. 4000 మంది మరణించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రమైన పర్యావరణ మార్పులు సంభవిస్తున్నాయి.

గడచిన రెండు దశాబ్దాలలో 70 శాతం అడవులు నశించాయి. 80 శాతం భూమిలో నేల క్షీణత తీవ్రమైన సమస్యగా ఉంది. మట్టి సారం చాలా త్వరగా క్షీణిస్తున్నది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో గణనీయమైన ఖనిజ నిక్షేపాలు, చమురు నిల్వలు, విలువైన రత్నాల గనులు ఉన్నాయి. కానీ దేశంలోని రాజకీయ కల్లోలాల వలనా, ఇతర అభివృద్ధి కొరతలవలనా వీటిని వినియోగించుకోవడంలేదు. కనీసం 50,000 సంవత్సరాల పూర్వంనాడే ఈ ప్రాంతంలో జనావాసాలున్నాయనీ, ఇక్కడి వ్యవసాయ జీవనం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటి అనీ చెప్పడానికి ఆధారాలున్నాయి. కానీ, 1747లో అహమ్మద్‌ షా దుర్రానీ స్థాపించిన రాజ్యం ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్‌ రాజకీయ స్వరూపానికి ఆద్యం. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌ చారిత్రికంగా ఎక్కువ కాలం వివిధ పర్షియన్‌ సామ్రాజ్యాలలో భాగంగా ఉన్నది.

అనేక సంస్కృతుల, జాతుల ఆవాసాలకు, సమ్మేళనానికీ, పోరాటాలకూ నిలయంగా ఆఫ్ఘనిస్తాన్‌ ప్రాంతం చారిత్రక విశిష్టత కలిగి ఉన్నది. ఆర్యులు (ఇండో-ఇరానియనులు అనగా కాంభోజ, బాక్ట్రియన్‌, పర్షియన్‌ జాతులు), మీడియన్‌ సామ్రాజ్యం, పర్షియన్‌ సామ్రాజ్యం, అలెగ్జాండర్‌, కుషానులు, హెప్తాలీట్‌లు, అరబ్బులు, తురుష్కులు, మంగోలులు – ఇంకా ఇటీవలి చరిత్రలో బ్రిటిష్‌ వారు, సోవియట్లు, ఆ తరువాత అమెరికన్లు – ఇలా ఎన్నో దేశాలు, జాతుల వారి యుద్ధాలకు ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగం యుద్ధరంగమయింది. అలాగే స్థానికులు కూడా పరిసర ప్రాంతాలపై దండెత్తి తమ రాజ్యాలను స్థాపించిన సందర్భాలు ఉన్నాయి. క్రీ.పూ. 2000-1200 మధ్య ఆర్యులు ఆఫ్ఘనిస్తాన్‌ ఉత్తర ప్రాంతంలో నివసించినట్లు భావిస్తున్నారు.

అయితే వారి స్వస్థలాన్ని గురించి పలు అభిప్రాయాలున్నాయి. క్రీ.పూ. 1700-1100 మధ్యకాలములో ఆర్యులు స్వాత్‌ లోయ, గాంధార, కుభ (కాబూల్‌) ప్రాంతములో రుగ్వేదాన్ని తొలిసారిగా ఉచ్చరించారు. క్రీ.పూ. 1800-800 మధ్య జోరాస్ట్రియన్‌ మతం ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్‌ ప్రాంతంలో ఆవిర్భవించి ఉండవచ్చునని చరిత్రకారులు ఊహిస్తున్నారు. ఋగ్వేద సంస్కృతానికి అవెస్త పారశీకానికి చాల సామీప్యమున్నది. రాజేశ్‌ కొచ్చర్‌ ప్రకారం రామాయణ, భారతాల మూల సంఘటనలు ఆఫ్ఘనిస్తాన్లో జరిగాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నాటికి ఈ ప్రాంతంలో పర్షియన్‌ సామ్రాజ్యం నెలకొన్నది.

క్రీ.పూ. 330లో అలెగ్జాండర్‌ దండెత్తి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. సెల్యూకస్‌ అధీనంలో సాగిన వారి రాజ్యం కొద్దికాలమే ఉంది. మౌర్యులు దక్షిణ, ఆగ్నేయ భాగాన్ని ఆక్రమించి బౌద్ధమతం వ్యాప్తికి కారకులయ్యారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో కుషానులు ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్‌ కేంద్రంగా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారి కాలంలో బౌద్ధమతం, సంస్కృతి బాగా వర్ధిల్లాయి. కుషానులను ఓడించిసస్సనిద్‌లు క్రీ.శ. మూడవ శతాబ్దంలో తమ రాజ్యాన్ని స్థాపించారు. తరువాత కిదరైట్‌ హూణుల పాలన ప్రారంభమైంది. వారిని ఓడించిన హెఫ్తాలైట్‌ల పాలన కొద్దికాలమే సాగింది.

కాని వారి రాజ్యం క్రీ.శ. 5వ శతాబ్దినాటికి చాలా బలమైనది. క్రీ.శ. 557లో హెఫ్తాలైట్‌లను ఓడించి ససానియన్‌ రాజు 1వ ఖుస్రో మరల పెర్షియాలో ససానియన్‌ బలం పునస్థాపించాడు. కాని కుషానుల, హెఫ్తాలైట్‌ల అనంతర రాజులు కాబూలిస్తాన్‌లో ఒక చిన్న రాజ్యం నిలుపుకొన్నారు. వారిలో చివరివాడైన ‘కాబూలి షా’ను జయించి అరబ్బు సైన్యాలు ఇస్లామిక్‌ పాలన ఆరంభం చేశారు.

మధ్య యుగంలో, 19వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఖొరాసాన్‌ అనేవారు. ఈ కాలంలోనే పలు నగరాలు అభివృద్ధి చెందాయి. ఇస్లాం మతం ఇక్కడ వ్యాప్తి చెందింది. తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ ప్రాంతం వివిధ సామ్రాజ్యాలకు కేంద్రంగా వర్ధిల్లింది. వాటిలో కొన్ని – సస్సానిద్‌లు(875?999), ఘజనివిద్‌లు (977?1187), సెల్జుకిద్‌లు (1037?1194), ఘురిద్‌లు (1149?1212), తైమూరిద్‌లు (1370?1506). వాటిలో ఘజని, తైమూర్‌ కాలాలు ఆఫ్ఘనిస్తాన్‌ చరిత్రలో ప్రముఖమైనవిగా పరిగణించబడుతున్నాయి. 1219లో చెంగీజ్‌ ఖాన్‌ నాయకత్వంలో మంగోలులు ఆఫ్ఘనిస్తాన్‌ను, తామర్లేన్‌ (తైమోర్‌ లాంగ్‌)ను జయించి విశాలమైన రాజ్యాన్ని ఏలారు. 1504లో బాబర్‌ (చెంగిజ్‌ ఖాన్‌, తైమూర్‌ లంగ్‌, వీరిద్దరి వంశానికీ చెందివాడు) కాబూల్‌ కేంద్రంగా ముఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.

1700 నాటికి ఆఫ్ఘనిస్తాన్‌ వివిధ భాగాలు వివిధ రాజుల అధీనంలో ఉన్నాయి. ఉత్తరాన ఉజ్బెక్‌లు, పశ్చిమాన సఫావిద్‌లు, మిగిలిన (అధిక) భాగం ముఘల్‌ లేదా స్థానిక తెగల పాలనలో ఉన్నాయి. 1709లో మీర్‌ వాయిస్‌ హోతాక్‌ అనే స్థానిక (పష్టూన్‌)నాయకుడు గుర్గిన్‌ ఖాన్‌ అనే కాందహార్‌ పర్షియన్‌ గవర్నరును ఓడించి, చంపి 1715 వరకు పాలించాడు. (పర్షియనులు స్థానికులను సున్నీ మార్గం నుండి షియా మార్గానికి మారుస్తున్నారు). 1715లో అతని కొడుకు మీర్‌ మహ్మూద్‌ హతాకీ రాజయ్యాడు. అతను 1722లో తన సైన్యంతో ఇరాన్‌పై దండెత్తి ఇస్ఫహాన్‌ నగరాన్ని కొల్లగొట్టి తానే పర్షియా రాజునని ప్రకటించుకొన్నాడు.

ఆ సమయంలో వేలాది ఇస్ఫహాన్‌ వాసులు (3 వేలమంది పైగా మతగురువులు, పండితులు, రాజ వంశీకులు) సంహరించబడ్డారు. తరువాత పర్షియాకు చెందిన నాదిర్‌ షా హతాకీ వంశాన్ని అంతం చేసి తిరిగి పర్షియా పాలన చేజిక్కించుకొన్నాడు. 1738లో నాదిర్‌ షా తన సైన్యంతో (ఇందులో పష్టూన్‌ జాతి అబ్దాలీ తెగకు చెందిన 4వేల సైనికులు కూడా ఉన్నారు) దండెత్తి కాందహార్‌ను, ఆ తరువాత ఘజని, కాబూల్‌, లాహోర్‌లను ఆక్రమించాడు. జూన్‌ 19, 1747న నాదిర్‌షా (బహుశా అతని మేనల్లుడు ఆదిల్‌ షా చేతిలో) హతమయ్యాడు. అబ్దాలీ తెగకు చెందిన నాదిర్‌ షా అనుచరుడు అహమద్‌ షా అబ్దాలీ కాందహార్‌లో నిర్వహించిన నాయకత్వం ఎన్నికలో అహమ్మద్‌ షా అబ్దాలీ వారి రాజుగా ఎన్నుకొనబడ్డాడు.

ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌గా పిలువబడే దేశం అహమద్‌ షా అబ్దాలీ ఏర్పరచినదనే చెప్పవచ్చును. పట్టాభిషేకం తరువాత అతను తన వంశం పేరు ‘దుర్రానీ’ (పర్షియన్‌ భాషలో ‘దర్‌’ అనగా ముత్యం)గా మార్చుకొన్నాడు. 1751నాటికి అహమద్‌ షా దుర్రానీ, అతని ఆఫ్ఘన్‌ సైన్యం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ అనబడే భాగాన్ని అంతటినీ జయించారు. ఇంకా పాకిస్తాన్‌ను, ఇరాన్లోని ఖొరాసాన్‌, కోహిస్తాన్‌లను, భారతదేశంలోని ఢిల్లీని కూడా జయించారు. అక్టోబరు 1772లో అహమ్మద్‌ షా రాజ కార్యాలనుండి విరమించి తన శేష జీవిత కాలం కాందహార్‌లో విశ్రాంతి తీసుకొన్నాడు. అతని కొడుకు. తైమూర్‌ షా దుర్రానీ రాజధానిని కాందహార్‌ నుండి కాబూల్‌కు మార్చాడు. 1793లో తైమూర్‌ మరణానంతరం అతని కొడుకు జమాన్‌ షా దుర్రానీ రాజయ్యాడు.

19వ శతాబ్దంలో జరిగిన ఆంగ్లో ఆప్ఘన్‌ యుద్ధాల (1839?42, 1878?80, 1919లలో జరిగినవి) బారక్జాయి వంశం అధికారంలోకి వచ్చింది. తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ వ్వహారాలలో బ్రిటిష్‌ వారి పెత్తనం కొంతకాలం సాగింది. 1919లో అమానుల్లా ఖాన్‌ అధికారంలోకి వచ్చిన తరువాతనే తన విదేశీ వ్యవహారాలలో ఆఫ్ఘనిస్తాన్‌ తిరిగి స్వతంత్రత సాధించుకొంది. (గ్రేట్‌ గేమ్‌ వ్యాసం చూడండి). బ్రిటిష్‌వారి జోక్యం ఉన్న సమయయంలో డురాండ్‌ రేఖ వెంబడి పష్టూన్‌ తెగల అధికారం విభజింపబడింది.

దీని వలన బ్రిటిష్‌, ఆఫ్ఘన్‌ వ్యవహారాలలో చాలా ఇబ్బందులు వచ్చాయి. 1933, 1973 మధ్యకాలంలో జాహిర్‌ షా రాజ్యం కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు నిలకడగా ఉన్నాయి. 1973లో జాహిర్‌ షా బావమరిది సర్దార్‌ దావూద్‌ ఖాన్‌ రాజ్యాన్ని చేజిక్కించుకొన్నాడు. అనంతరం 1978లో దావూద్‌ ఖాన్‌ను, అతని పూర్తి పరివారాన్ని హతం చేసి ఆఫ్ఘన్‌ కమ్యూనిస్టులు అధికారాన్ని తమ హస్తగతం చేసుకొన్నారు. ఈ తిరుగుబాటును ఖల్క్‌ లేదా మహా సౌర్‌ విప్లవం అంటారు.

అమెరికా, రష్యాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం (శీతల యుద్ధం)లో సమీకరణాల భాగంగా ఆఫ్ఘన్‌ ప్రభుత్వ వ్యతిరేక ముజాహిదీన్‌ బలగాలకు పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఐ.ఎస్‌.ఐ ద్వారా అమెరికా సహకారాన్ని అందించడం ప్రారంభించింది. దానితో స్థానిక కమ్యూనిస్టు ప్రభుత్వానికీ-తమకూ 1978లో కుదిరిన ఒప్పందాన్ని పురస్కరించుకొని డిసెంబరు 24, 1979న దాదాపు లక్ష మంది సోవియట్‌ యూనియన్‌ సేనలు ఆఫ్ఘనిస్తాన్‌ భూభాగంలో (స్థానిక ప్రభుత్వ రక్షణకై) ప్రవేశించాయి. వీరికి ఆఫ్ఘనిస్తాన్‌ కమ్యూనిస్టు అనుకూల ప్రభుత్వం సేనలు మరో లక్ష తోడైనాయి.

ఫలితంగా 10 సంవత్సరాలు సాగిన (అంతర్‌)యుద్ధంలో 6 లక్షలు – 20 లక్షలు మధ్య ఆఫ్ఘన్‌ వాసులు మరణించారని అంచనా. 50 లక్షలు పైగా ఆఫ్ఘన్‌ వాసులు పొరుగు దేశాలకు శరణార్ధులుగా వెళ్ళారు. ప్రపంచదేశాలనుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికా, పాకిస్తాన్‌ ద్వారా, పెద్దపెట్టున ముజాహిదీన్‌కు అనేక విధాలుగా సహకారం అందించింది. 1989లో సోవియట్‌ సేనలు వెనుకకు మళ్ళాయి. ఇది తమ నైతిక విజయంగా అమెరికా భావిస్తుంది.

తరువాత ఆఫ్ఘనిస్తాన్‌ అవుసరాలను అమెరికా దాదాపు పట్టించుకోలేదు. 1992 దాకా రష్యా మద్దతుతో నజీబుల్లా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగి తరువాత పతనమయ్యింది. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్‌ సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితి కకావికలమయ్యింది. విద్యావంతులు, మేధావులు చాలామంది వలస పోయారు. నాయకత్వం కొరవడింది. తెగల నాయకత్వాలు తమలో తాము కలహించుకొంటూ దేశానికి నాయకత్వం కూడా వారే నిభాయించారు. 1994లోని ఘర్షణలోనే కాబూల్‌లో 10,000 మంది పైగా మరణించారు.

నాయకత్వం కొరవడి రోజువారీ యుద్ధాలు, దోపిడీలు, లంచగొండితనం పెరిగిన అదనులో తాలిబాన్‌ బలమైన శక్తిగా పరిణమించి, క్రమంగా వ్యాప్తి చెంది 1996లో కాబూల్‌ను తన వశంలోకి తెచ్చుకోగలిగింది. 2000నాటికి దేశంలో 95% భాగం వారి అధీనంలోకి వచ్చింది. దేశం ఉత్తర భాగంలో మాత్రం ఉత్తర ఆఫ్ఘన్‌ సంకీర్ణం ‘బదక్షాన్‌’ ప్రాంతాన్ని ఏలుతున్నది. తాలిబాన్‌ ఇస్లామిక్‌ న్యాయ చట్టాన్ని చాలా తీవ్రంగా అమలు చేసింది. ఈ కాలంలో ప్రజల జీవనం, స్వేచ్ఛ బాగా దెబ్బ తిన్నాయి.

స్త్రీలకు, బాలికలకు ఉద్యోగాలు, చదువు నిషేధించారు. నియమాలను ఉల్లంఘించినవారికి దారుణమైన శిక్షలు విధింపబడ్డాయి. కమ్యూనిస్టులు దాదాపు తుడిచివేయబడ్డారు. అయితే 2001నాటికి గంజాయి ఉత్పాదన అధిక భాగం నిలిపివేయడంలో వారు కృతకృత్యులయ్యారు. సెప్టెంబరు 11, 2001లో అమెరికా నగరాలపై జరిగిన ఉగ్రవాదుల దాడుల అనంతరం అమెరికా ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లోని అల్‌-కైదా ఉగ్రవాదుల శిక్షణా కేంద్రాలను అంతం చేయడానికి ఆపురేషన్‌ ఎండ్యూరింగ్‌ ఫ్రీడమ్‌ అనే మిలిటరీ చర్యను పెద్దయెత్తున మొదలుపెట్టింది. ఒసామా బిన్‌-లాడెన్‌ను తమకు అప్పగించకపోతే తాలిబాన్ల ప్రభుత్వాన్ని అంతం చేస్తామని బెదరించింది.

ఇదివరకటి ఆఫ్ఘన్‌ ముజాదీన్‌ నాయకులు, అమెరికా సైన్యం కలిపి నిర్వహించిన యుద్ధం ఫలితంగా హమీద్‌ కర్జాయి నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది. 2002లో దేశవ్యాప్తంగా నిర్వహించిన లోయా జిర్గా ద్వారా హమీద్‌ కర్జాయి తాత్కాలిక ప్రెసిడెంట్‌గా ఎన్నుకొనబడ్డాడు. 2003లో రాజ్యాంగం ఆమోదించబడింది. 2004 ఎన్నికలలో హమీద్‌ కర్జాయియే ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్తాన్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. 2005లో (1973 తరువాత జరిగినవి ఇవే ఎన్నికలు) సార్వత్రిక ఎన్నికల ద్వారా నేషనల్‌ అసెంబ్లీ ఏర్పరచబడింది. దేశం పునర్నిర్మాణం జరుగుతున్నది కాని అనేక సమస్యలతో ఆఫ్ఘనిస్తాన్‌ సతమతమవుతున్నది.

పేదరికం, మౌలిక సదుపాయాల కొరత, దేశమంతటా ఉన్న ల్యాండ్‌ మైనులు (భూమిలో పాతబడి ఉన్న బాంబులు), ప్రేలుడు పదార్ధాలు, ఆయుధాలు, చట్టవ్యతిరేకంగా సాగుతున్న గంజాయి పెంపకం, రాజకీయ అంతర్యుద్ధాలు, తాలిబాన్ల దాడులు, మిగిలి ఉన్న అల్‌-కైదా ప్రభావం, (ప్రత్యేకించి ఉత్తరభాగంలో ఉన్న) అనిశ్చితి – ఇవి కొన్ని సమస్యలు. చారిత్రికంగా ఆఫ్ఘన్‌ రాజకీయాలలో అధికారంకోసం తగవులు, గూడుపుఠాణీలు, తిరుగుబాట్లు అంతర్భాగాలుగా ఉన్నాయి. రాజరికం, మతవాదపాలన, కమ్యూనిజం, ప్రజా ప్రభుత్వం – ఇలా ఎన్నో విధానాలు మారాయి.

2003లో జరిగిన లోయా జిర్గా ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌ ఇస్లామిక్‌ రిపబ్లిక్‌గా ప్రకటించబడింది. ఆఫ్ఘన్‌ ప్రెసిడెంట్‌ హమీద్‌ కర్జాయి, అతిధి పర్యటనలో ఉన్న అమెరికా ప్రెసిడెంట్‌ జార్జి బుష్‌లతో మార్చి 1, 2006న విందులో పాల్గొన్న ఆఫ్ఘన్‌ రాజకీయ నాయకులు. ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్‌ ప్రెసిడెంట్‌ హమీద్‌ కర్జాయి అక్టోబర్‌ 2004లో ఎన్నికయ్యాడు. ప్రస్తుత పార్లమెంట్‌ 2005 ఎన్నికల ద్వారా ఏర్పడింది. వివిధ వర్గాలనుండి ఎన్నికైనవారిలో 28% స్త్రీలు (రాజ్యాంగం ప్రకారం కనీసం 25% స్రీలకు కేటాయించబడింది). ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాధికారి అబ్దుల్‌ సలామ్‌ అజీమీ ఇంతకుముందు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో 60,000 మంది పోలీసు ఆఫీసరులు ఉన్నారు.

ఈ సంఖ్యను 80,000 వరకు పెంచే ప్రయత్నం జరుగుతున్నది. దేశంలో ఉన్న ఉగ్రవాద కార్యకలాపాలు, సైనికుల విస్తృతమైన పాత్ర, విదేశీ సేనల ఉనికి, సామాజిక అస్తవ్యస్తల వలన చట్టం అమలు చాలా క్లిష్టతరమౌతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రపంచంలో బాగా వెనుకబడిన దేశంగా పరిగణించబడుతుంది. మూడింట రెండు వంతులమంది జనాభా తలసరి రోజువారీ ఆదాయం 2 అమెరికన్‌ డాలర్ల లోపే ఉన్నది. అంతర్గత యుద్ధాలూ, విదేశీ ఆక్రమణలూ, రాజకీయ అనిశ్చితీ దేశం ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీశాయి. 1998-2001 మధ్య కలిగిన వర్షాభావం దేశాన్ని మరింత కష్టాలలోకి నెట్టింది. 2005నాటికి నిరుద్యోగులు 40% వరకు ఉన్నారు. కాని 2002 తరువాత దేశం చెప్పుకోదగిన అభివృద్ధి సాధించింది.

మాదక ద్రవ్యాలు మినహాయిస్తే దేశం జిడిపి 2002లో 29%, 2003లో 16%, 2004లో 8%, 2005లో 14% వృద్ధి చెందింది.జ51్ఱ అయితే దేశం ‘జిడిపి’లో దాదాపు మూడవవంతు మాదక ద్రవ్యాల పెంపకం, ఉత్పత్తుల మూలంగా జరుగుతున్నది (గంజాయి, మార్ఫీన్‌, హెరాయిన్‌, హషీష్‌ వంటివి) దేశంలో షుమారు 33 లక్షలమంది గంజాయి పెంపకంలో పాలుపంచుకొంటున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌ అభివృద్ధికి ప్రపంచ దేశాల సహకార కార్యకలాపాలు ఆశాజనకంగా ఉన్నాయి. 2001 డిసెంబరు ‘బాన్‌ ఒడంబడిక’ ప్రకారం తరువాత 2002లో టోక్యో సమావేశంలో వివిధ దేశాల హామీల ప్రకారం పెద్ద పెట్టున ఆఫ్ఘనిస్తాన్‌ అభివృద్ధికి అంతర్జాతీయ సహకారం లభిస్తున్నది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, పాలనా సంస్కరణలలో ఈ సహకారం వినియోగమవుతున్నది. ఆసియా అభివృద్ధి బ్యాంకు నివేదిక ప్రకారం ప్రస్తుత పునర్నిర్మాణ కార్యక్రమం రెండు దిశలలో పురోగమిస్తున్నాది. కీలకమైన మౌలిక సదుపాయాలు, వనరులు సమీకరించడం… సోవియట్‌ ప్రణాలికా విధానంలో ఆరంభించిన పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థలను మార్కెట్‌ వాణిజ్యపరంగా సమాయుత్తం చేయడం. కాబూల్‌ నగరం పునర్నిర్మాణం ప్రణాళిక – 9 బిలియన్‌ డాలర్ల అంచనాతో యుద్ధకాలంలో వలస వెళ్ళిన 40 లక్షలపైగా ఆఫ్ఘన్‌ శరణార్ధులు పొరుగు దేశాలనుండి మరలి రావడం దేశం పునర్నిర్మాణ కార్యక్రమంలో కీలకమైన ఆంశంగా పరిణమించింది.

వారు ఉత్సాహంతో క్రొత్త నైపుణ్యాలను తమతో వెంటబెట్టుకొస్తున్నారు. దీనికి ప్రతియేటా అంతర్జాతీయ సహాయంగా లభిస్తున్న 2-3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి తోడవుతున్నది. ఫలితంగా వాణిజ్యరంగం ఊపందుకొంటున్నది. మొత్తానికి దేశం పేదరికం నుండి బయటపడి ఆర్ధికంగా నిలకడైన స్థితిని సాధిస్తుందన్న ఆశ చిగురించింది. దేశంలో గణనీయమైన, విలువైన ఖనిజ సంపద నిక్షేపాలు (సహజ వాయువు, పెట్రోలియమ్‌ వంటివి) ఉన్నాయన్న వార్తలు ఈ అంచనాలకు దోహదం చేస్తున్నాయి.

తగినంత మౌలిక సదుపాయాలు సిద్ధం చేస్తే ఈ భూగర్భ వనరులను సద్వినియోగం చేసికోవచ్చునని పాలకుల అంచనా. బంగారం, రాగి, ఇనుము,బొగ్గు వంటి విలువైన ఖనిజాలు కూడా పెద్దమొత్తాలలో ఉన్నాయని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ దక్షిణ ఆసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్‌)లోనూ, ఆర్ధిక సహకార సంస్థ (ఈకో)లోనూ, ఇతర ప్రాంతీయ సంస్థలలోనూ, ఇస్లామిక్‌ కాన్ఫరెన్స్లోనూ సభ్యత్వం కలిగి ఉంది.

మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రయత్నాలు…

ఆఫ్ఘనిస్తాన్‌ ఆర్ధిక వ్యవస్థలో గంజాయి పెంపకం, ఉత్పత్తులు కీలకమైన స్థానం కలిగి ఉన్నాయి. దేశం ఆదాయంలో షుమారు మూడవ వంతు వీటిద్వారానే అభిస్తున్నది. కనుక గ్రామీణ రాజకీయాలలో మాదక ద్రవ్యాల నిషేధం చర్యలు బలమైన పరిణామాలకు కారణమౌతాయి.

దేశంలో 33లక్షలమంది దీనిపైనే ఆధారపడి ఉన్నారు. ఒకప్రక్క నిషేధం చర్యలు అమలులో ఉన్నాగాని రెండేళ్ళలో గంజాయి ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. ఎక్కువ మందికి జీవనాధారమైన గంజాయిని నిషేధిస్తే అసలు దేశం పునర్నిర్మాణమే కుంటుపడే అవకాశం ఉన్నదని, తలెబాన్‌ తీవ్రవాదులకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశమున్నదనీ విశ్లేషకులు భావిస్తున్నారు.