హైదరాబాద్, అక్టోబర్ 29 (న్యూస్‌టైమ్): భారీ వర్షసూచన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రాలలో అల్పపీడనాలు ఏర్పడిన కారణంగా దక్షిణ భారతావనిలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కింది స్థాయి అధికారులను అప్రమత్తం చేశాయి.

ఓ వైపు బంగాళాఖాతంలో వాయుగుండం, మరోవైపు అరేబియా సముద్రంలో తుపాను నేపథ్యంలో దక్షిణ భారతావనిలో మేఘాలు కమ్ముకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

దట్టమైన మేఘాలు కమ్మేశాయి. దక్షిణ భారతావనికి చుట్టూ అల్పపీడనాలు ఉండటానికి తోడు, ఉపరితల ఆవర్తనం తోడు కావడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని, చాలా ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి.

ఎల్బీనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడచిన 24 గంటల వ్యవధిలో తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నెల్లూరు, కృష్ణ, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షాలు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాలక్రమేనా తుపానుగా మారే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ అధికారులు తుపాను గమనాన్ని అనుక్షణం గమనిస్తున్నారు.

ప్రస్తుతానికి ఈ తుపాను ఎప్పుడు, ఎక్కడ తీరాన్ని దాటుతుందో వెల్లడించే అవకాశాలు లేవని అధికారులు అంటున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 5.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కళ్యాణి ప్రాజెక్టు గేట్లు మొరాయించడం, గేట్లు ఎత్తకపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. రహదారిపై వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఎల్లారెడ్డి – తిమ్మారెడ్డిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణి ప్రాజెక్టు ఏఈ అందుబాటులో లేకపోవడంతో నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నిజాంసాగర్ డిప్యూటీ ఈఈ దత్తాద్రి కళ్యాణి ప్రాజెక్టు వద్దకు చేరుకొని గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు.

కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని కూడవెళ్లి వాగులో రాత్రి కురిసిన వర్షానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో కూడవెళ్లి వాగు భారీగా ప్రవహిస్తోంది. ప్రవాహంలో దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన అబ్బబోయిన వేణు అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. వాగు వద్ధ సమీప గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో చేరారు.

పిడుగుపాటుకు మరణించిన వీఆర్‌ఏ మంద లచ్చయ్య

కాగా, నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామంలో పిడుగు పడి వీఆర్‌ఏ మంద లచ్చయ్య (45) మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కాగా పిడుగు పాటుకు లచ్చయ్య మృతి చెందారు.