ఒకపక్క లేవంటూనే మరోపక్క ఆంక్షలు విధిస్తూ విదేశీయులను మానసిక వేధనకు గురిచేయడం అగ్రరాజ్యం అమెరికాకు పరిపాటుగా మారింది. గంపెడు ఆశలతో అమెరికాకు వెళ్ళిన వందలాది మంది ఇతర దేశాల విద్యార్థులు చట్టం చిక్కుల్లో చిక్కుకొని విలవిలలాడటం విషాదకరం. చట్టాన్ని అతిక్రమించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ భారీ సంఖ్యలోనే ఉన్నారు. చదువుకోవడానికి మాత్రమే అనుమతి పొందిన విద్యార్థులు, చదువు ముగిసిన తర్వాత స్వదేశం వెళ్ళకుండా, బోగస్ విద్యాసంస్థల్లో చేరి చట్టవిరుద్ధంగా కొనసాగుతున్నారనేది అమెరికా అధికారుల ఆరోపణ. ఈవిధంగా అక్రమంగా ఉంటున్నవారిని వల పన్ని పట్టుకోవడానికి అక్కడి అధికారులే ఒక బోగస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసి, అందులో చేరినవారిని, చేర్పించినవారిని అరెస్టు చేస్తున్నారు. భారతీయ విద్యార్థుల ఫీజుల రూపంలో అమెరికాకు ఏటా ఆరు వందల కోట్ల డాలర్ల మేర ఆదాయం లభిస్తోంది. అమెరికాకు భారత దేశంతో సౌహార్ద్ర సంబంధాలున్నాయి.

భారతీయులు అమెరికా ఆర్థి క వ్యవస్థ బలోపేతానికి ఎంతో సేవలు అందించారు. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు కూడా విద్రోహులో, ఉగ్రవాదులో కారు. పొట్ట పోసుకోవడానికి వచ్చిన విద్యార్థులపై మానవీయంగా వ్యవహరించడం అమెరికా బాధ్యత. అమెరికాలో బోగస్ విశ్వవిద్యాలయాలున్న మాట నిజం. అటువంటివాటిలో కొందరు విదేశీ విద్యార్థులు చేరుతున్నదీ నిజమే. ఈ అక్రమ పోకడల ను మార్గాలను అరికట్టాలంటే, అమెరికా అధికారులు చేయాల్సింది ప్రమాణాలు లేని విశ్వవిద్యాలయాలను అరికట్టడం. నిబంధనలను కఠినంగా అమలుచేయడం. కానీ బోగస్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి విద్యార్థులను ప్రలోభపెట్టి, శిక్షించడం ఎంతవరకు నైతికమనే ప్రశ్న తలెత్తుతోంది.

అమెరికాలో చట్టానికి చిక్కిన విద్యార్థులు తప్పు తెలిసి చేసినా ఏ పరిస్థితుల్లో చేశారనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా అమెరికాకు భారతీయ విద్యార్థులు రుణం తీసుకొని వెళ్తారు. రెండేళ్ల చదువు తర్వాత ఉద్యోగానికి అనుమతి లభిస్తుందో లేదో తెలీదు. తీరా ఉపాధి వీసా లభించకపోతే మరో రెండేళ్ల కోర్సులో చేరి అక్కడే కొనసాగుతారు. ఫీజుల కోసం, బతుకడానికి కష్టాలు మొదలవుతాయి. ఇవన్నీ తమను ప్రేమతో పెంచిన తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని దయనీయస్థితి వారిది.

కళాశాలలో చేరిన మొదటిరోజు నుంచే ఐచ్ఛిక ఆచరణాత్మక శిక్షణ (ఓపీటీ) లభించిందీ అంటే ఆ విశ్వవిద్యాలయంపై అనుమానం రావలిసిందే. కానీ అటువంటి విద్యాసంస్థ దొరుకడమే మహాభాగ్యంగా విద్యార్థులు భావిస్తారు. అక్కడి పరిస్థితిపై అందరికి పూర్తి అవగాహన ఉండదు. పల్లె నుంచి పట్నం పోయినా, అమెరికా తదితర దేశాలకు వెళ్ళినా వలసపోయిన వారి ఆలోచనాధోరణిపై తమకన్నా ముందువచ్చిన వారి అనుభవాల ప్రభావం ఉంటుంది. అమెరికా పాలకులు తమకు చౌకగా శ్రమజీవులు కావాలనుకున్నప్పుడు, చట్ట విరుద్ధంగా ఉంటున్న వారిపట్ల, చదువుతూ ఉద్యోగాలు చేస్తున్న వారిపట్ల చూసీ చూడనట్టు వ్యవహరించారు. ఈ అనుభవాలే ఇక్కడినుంచి అనేకమంది యువతీ యువకులు అప్పుచేసి అమెరికా వెళ్ళడానికి ప్రేరణగా మారాయి.

కానీ అమెరికా పాలకులు తమ అవసరం తీరిన తర్వాత నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్నారు. ఈ విధానపరమైన మార్పు విద్యార్థుల నెత్తిపై పిడుగుపాటుగా మారింది. తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి అమెరికాకు పంపిస్తే, ఉత్త చేతులతో తిరిగిరావడం విద్యార్థులకు బాధగానే ఉంటుంది. కానీ మెడపట్టి గెంటుతున్నప్పుడు, గౌరవంగా తిరిగివచ్చి స్వదేశంలో కానీ మరో దేశంలో కానీ తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడమే ఉత్తమమైన మార్గమని న్యాయనిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో దిక్కుతోచకుండా ఉన్న విద్యార్థులను ఆదుకోవడానికి టీఆర్‌ఎస్ అనుబంధ విభాగం, కొన్ని ప్రవాస సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమైనదిగా పేర్కొనవచ్చు. తెలంగాణ సమాజం కూడా వచ్చే విద్యార్థులకు నైతిక మద్దతు ఇవ్వాల్సి ఉంది. తప్పయినా ఒప్పయినా అమెరికా ప్రభుత్వం తన అవసరాలకు తగినట్టు తన విధానాలను అమలుచేస్తోంది. కానీ మనం చేయవలసిందేమిటనేది కూడా ఆలోచించాలి.

భారత ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తన శక్తిమేర కృషిచేయాలి. ఈ సమస్యను ఇక్కడితో వదిలేయకూడదు. కేంద్ర ప్రభుత్వం, భారతీయ సమాజం ఈ పరిస్థితులపై మరింత విస్తృత చర్చ జరుపాల్సి ఉంది. ఒకప్పుడు వైద్యులు, ఆ తర్వాత ఇంజినీర్లు ఇంకా భిన్నరకాల ఉన్నత విద్యావంతులను అమెరికా అవసరాలకు తగినట్టు తయారుచేయడం తప్ప మనకు గత్యంతరం లేదా అనేది విధానకర్తలు, భిన్నరంగాల నిపుణులు ఆలోచించాలి. యువతకు ఇతర దేశాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? విదేశీ వ్యామోహమే కారణమైతే, పట్టించుకోవలసిన అవసరంలేదు. కానీ ఇక్కడ వారి అభివృద్ధికి మార్గాలు మూతపడి ఉన్నాయా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది. చెట్టుకు కాయలు బరువా అన్నట్టు, మన పిల్లలను పోషించుకోలేని దౌర్భాగ్య స్థితి ఏ సమాజానికీ ఉండదు. భారతీయ సమాజానికి అంతకన్నా లేదు. మన శక్తియుక్తులు మనకోసం ఉపయోగపడేవిధంగా విధాన రూపకల్పన చేయడం మన పాలకుల బాధ్యత.

కానీ, అందుకు భిన్నమైన వాతావరణం తెలుగు రాష్ట్రాలలో ఉంది. ఇక్కడ అధికారాన్ని వెలగబెడుతున్న పార్టీలు గాని, విపక్షంలో ఉన్న పార్టీలు గానీ, కేవలం ఎన్నికల సమయంలో మినహా మిగతా సమయంలో ప్రవాసాంధ్రుల కష్టాల గురించి పెద్దగా ఆలోచించింది లేదు. అటు తెలంగాణలో అయినా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా విదేశీ బాధలు ఒక్కటే విధంగా మారడం దారుణమనే చెప్పాలి.