క్యూలైన్ వద్ద బారులుతీరి కినిపిస్తున్న భక్తులు

తిరుమల, అక్టోబర్ 30 (న్యూస్‌టైమ్): తిరుమలేశుని సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం మూలవిరాట్టుకు నిత్య కైంకర్యాలు నిర్వహించిన అనంతరం ఘంటా మండపంలో స్వామివారి ప్రతిరూపమైన భోగశ్రీనివాస ఉత్సవమూర్తికి సహస్ర కళశాభిషేకం అనే విశేషమైన వారపు సేవను అర్చకులు నిర్వహించారు.

ఇక రద్దీ దృష్ట్యా మూలవిరాట్టును దర్శించుకోవడానికి సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 12 గంటలు, ప్రత్యేకప్రవేశ దర్శనానికి వెళ్లే భక్తులకు 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం, ఆథార్ కార్డు నమోదుతో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతొంది.

కాగా, మంగళవారం 78,885 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు, వారు సమర్పించిన కానుకలతో శ్రీవారికి రూ 3.77 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. మొత్తం 25,652 మంది భక్తులు తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించారు.

తిరుమల కొండపైన కేశఖండనశాల వద్ద భక్తుల రద్దీ

మరోవైపు, తిరుమలలో భక్తులకు బ్రేక్‌ దర్శనం టిక్కెట్లను విక్రయిస్తున్న నలుగురు దళారులను అరెస్టుచేసిన తిరుమల టూటౌన్‌ పోలీసులు బుధవారం వారిని రిమాండుకు తరలించారు. తిరుపతికి చెందిన శ్రీరామ్‌ వీరాచారి అలియాస్‌ వీరాచారి, తిరుమలలో ‘రియల్‌ హీరో’ పత్రిక రిపోర్టర్‌ తోట వెంకటేశ్వరరావు అలియాస్‌ వెంకట్‌, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన యేడిద వీరవెంకట కృష్ణ అలియాస్‌ కృష్ణ, తిరుపతి శివజ్యోతినగర్‌కు చెందిన సబ్బరాయిని ఉమాశంకర్‌ రెండు ముఠాలుగా ఏర్పడి తిరుమలలో బ్రేక్‌దర్శన టికెట్లు అధిక ధరలకు విక్రయించేవారు.

వేర్వేరు వృత్తుల్లో ఉన్న వీరిలో శ్రీరామ్‌వీరాచారి, సుబ్బరాయని ఉమాశంకర్‌లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో పరిచయాలు పెంచుకుని వారి వద్ద నుంచి తమ స్నేహితులు బంధుమిత్రులకు తిరుమల శ్రీవారి దర్శనం కావాలని సిఫారసు లేఖలను తీసుకునే వారు. లేఖలను ‘రియల్‌హీరో’ పత్రిక రిపోర్టర్‌ తోట వెంకటేశ్వరరావు, యేడిద కృష్ణ కలిసి తిరుమలలో భక్తులకు అధిక ధరలకు విక్రయించి నగదును ఆన్‌లైన్‌ పేమెంట్‌ ద్వారా తీసుకుని నలుగురు పంచుకునేవారు.

కాగా, ఈనెల 21వ తేదీన మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు లెటర్‌పై టికెట్‌ కంటే అధిక ధరలకు అమ్మినట్లు తితిదే విజిలెన్స్‌ అధికారులు గుర్తించి తిరుమల టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా తిరుమల టూటౌన్‌ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల సిఫారసు లేఖలు ఇచ్చినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టేందుకు భక్తులు సహకరించాలని విన్నవించారు.