విశాఖపట్నం, నవంబర్ 7 (న్యూస్‌టైమ్): విశాఖపట్నానికి చెందిన తొమ్మిది నెలల విశ్వ విహాన్ బాబుకి గుండె శస్త్ర చికిత్స నిమిత్తం 2.5 లక్షలు ఖర్చు చేసి సీబీఐ మాజీ జేడీ వి.వి. లక్ష్మీనారాయణ తన ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్ రెయిన్‌బో ఆసుపత్రిలో బాలుడికి ఆపరేషన్ చేయించినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. విశ్వవిహాన్ కోలుకున్నాక గురువారం కుటుంబ సభ్యులు లక్ష్మీనారాయణ వద్దకు ఆ బాలుడిని తీసుకువచ్చి చూపించారు.

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో విశాఖ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్ధిగా లక్ష్మీనారాయణ పోటీచేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విశాఖలోనే నివాసం ఏర్పాటుచేసుకున్న ఆయన నగరంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనందిస్తూ వస్తున్నారు.

పార్టీ శ్రేణుల ద్వారా విశ్వవిహాన్ విషయాన్ని తెలుసుకున్న ఆయన తనవంతు సాయంగా ఆసుపత్రిలో శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చులను భరించారు. మాజీ జేడీ అడుగుజాడల్లో ఆయన తనయుడు, ఐసీఎస్ అధికారి సాయిప్రణీత్ కూడా పయనిస్తున్నారన్న విషయం విశ్వవిహాన్‌కు చేసిన సాయంతో అర్ధమైంది. కోలుకున్న చిన్నారితో ప్రణీత్ కూడా కాసేపు ముచ్చటించి, తన ఆనందాన్ని తెలియచేశారు.