శ్రీకాకుళం, నవంబర్ 7 (న్యూస్‌టైమ్): ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతి తమ్మినేని సీతారాం ఆమదాలవలసలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ‘స్పందన’ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సోమవారం అధికారులు నిర్వహిస్తున్నారు.

సమయాభావం కారణంగా నెలలో రెండుసార్లు తన క్యాంప్ కార్యాలయంలో అర్జీదారులకు తాను అందుబాటులో ఉండాలని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం నిర్ణయించారు. అందులో భాగంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి (గురువారం) ప్రజల నుంచి ఆయన నేరుగా అర్జీలను, వనతులను స్వీకరిస్తారు. గురువారం నిర్వహించిన ‘స్పందన’నుద్దేశించి తమ్మినేని మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగానే వారం వారం వివిధ స్థాయిల్లో ‘స్పందన’ కార్యక్రమాన్ని నిర్వహణకు ప్రాధాన్యతను ఇచ్చి ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించడాన్ని బట్టి సీఎం దీనికి ఇస్తున్న ప్రాధాన్యత అర్ధమవుతోందన్నారు.

సామాజిక సమస్యలు మాత్రమే కాకుండా వ్యక్తిగత సమస్యలపైనా దృష్టిపెట్టామని, అధికార యంత్రాంగం పారదర్శకంగా సమస్యలను పరిష్కరించుటకు కృషి చేయాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వం జవాబుదారీతనం వహించే కార్యక్రమంగా ‘స్పందన’ను అభివర్ణించారు. వినతులలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలను విభజించాలని, సమస్యలు పరిష్కారంలో పైరవీలకు తావులేదన్నారు. ప్రతి 15 రోజులకు గురువారం రోజున స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని, వచ్చిన వినతులకు నాణ్యమైన పరిష్కారం ఉండాలని అధికారులకు సూచించారు. తమ సమస్య పరిష్కారం విషయంలో ప్రజల్లో సంతృప్తి కలగాల్సి ఉందన్నారు. పరిష్కారం అయ్యే వినతులపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తామని తమ్మినేని తెలిపారు.

స్పందన కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్ఈ బి. రాంబాబు, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.వేణుగోపాల్, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. శ్రీధర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.రవిప్రకాష్, ఆమదాలవలస తహశీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.